అత్యంత సంపన్న దేశంగా పేరు తెచ్చుకున్న సౌదీ అరేబియా మరో భారీ ప్రాజెక్టుకు నాంది పలికింది. ఆకాశాన్నంటే నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆ దేశం.. మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇటీవలే తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించి, దాన్ని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన సౌదీ.. దానికి పాంజియోస్ అనే పేరు కూడా పెట్టింది. అయితే తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి సౌదీ ప్లాన్ చేసింది. రాజధాని నగరం రియాద్ లో ‘ముకాబ్’ పేరుతో అతి భారీ కట్టడానికి డిజైన్ చేసింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
క్యూబ్ ఆకారంలో ఉన్న ఈ భారీ బిల్డింగ్ దాదాపు 400 మీటర్లు ఎత్తు ఉండనుంది. కాగా ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దది. ఇందులో మ్యూజియం, టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ, మల్టీ పర్పస్ థియేటర్, మరో 80కిపైగా కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు కూడా ఏర్పాటు కానుండడం విశేషం. కాగా ఈ భారీ నిర్మాణాన్ని 2030 నాటికల్లా పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టూరిజం సంస్థ తెలిపింది.