- సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని చర్చలు
- గొప్ప భవిష్యత్తు కోసం కలిసి పని చేస్తామన్న సల్మాన్
న్యూఢిల్లీ: ప్రాంతీయ, అంతర్జాతీయ స్థిరత్వానికి, సంక్షేమానికి ఇండియా–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియాకు సన్నిహిత, అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రెండు దేశాలు తమ సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాయని తెలిపారు. సోమవారం ఈ మేరకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇండియా – సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ తొలి సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు రివ్యూ చేశారు. ముందుగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మన భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను గుర్తించాం. మన బంధం ఈ రోజు కొత్త దిశను, శక్తిని పొందనుంది” అని తెలిపారు.
ఢిల్లీకి రావడం సంతోషంగా ఉంది..
మూడు రోజుల పర్యటన కోసం గత శుక్రవారం ఢిల్లీకి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చారు. జీ20 సమిట్ తర్వాత ఇక్కడే ఉన్నారు. సోమవారం హైదరాబాద్ హౌస్‌లో ప్రధానితో సమావేశమయ్యారు. అంతకుముందు ఉదయం 10 గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. జీ20 సమిట్‌ను నిర్వహించినందుకు ఇండియాకు అభినందనలు’’ అని చెప్పారు. సమిట్‌లో చేసిన ప్రకటనలు ప్రపంచానికి ప్రయోజనం కల్పిస్తాయని అన్నారు. రెండు దేశాలకు గొప్ప భవిష్యత్తును సృష్టించేందుకు తాము కలిసి పనిచేస్తామని తెలిపారు. మోదీతో చర్చల తర్వాత సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.
ALSO READ:ముందస్తు అనుమతి లేకుండానే.. పెద్దాఫీసర్లనూ విచారించొచ్చు
కుదిరిన 8 ఒప్పందాలు
కీలక విషయాల్లో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు 2019లో ఇండియా–సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. తాజా చర్చల్లో భాగంగా ఎనర్జీ, డిఫెన్స్, టూరిజం, స్పేస్ తదితర రంగాల్లో ఇండియా, సౌదీ మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. సౌదీ వాగ్దానం చేసిన100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గుర్తించడంలో సాయపడటానికి ఒక ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ రిఫైనరీ ప్రాజెక్టుల పురోగతి రెండు వైపులా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుందని నిర్ధారించడానికి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ఓకే చెప్పాయి. ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ)పై సంప్రదింపులు జరిపేందుకు రెండు దేశాలు ఒప్పుకున్నాయి. ఫిన్ టెక్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం అవకాశాలను పరిశీలించేందుకు అంగీకరించాయి.