భారత్​ సహా 14 దేశాలకు సౌదీ వీసాలు బంద్

భారత్​ సహా 14 దేశాలకు సౌదీ వీసాలు బంద్

హజ్: భారత దేశంతో సహా 14 దేశాలకు వీసాల జారీని సౌదీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి ఈ ఏడాది జూన్ మధ్యకాలంలో హజ్ యాత్ర ముగిసేవరకు వీసాల జారీపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. సరైన రిజిస్ట్రేషన్‌‌‌‌ లేకుండా హజ్‌‌‌‌ యాత్రకు వచ్చేవాళ్లను, అక్రమ వలసలను కంట్రోల్‌‌‌‌ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దౌత్య వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లు, హజ్‌‌‌‌ కోసం ప్రత్యేక వీసాలు పొందినవాళ్లు రాకపోకలు కొనసాగించవచ్చంది. ఇండియా, పాక్, బంగ్లాదేశ్‌‌‌‌, యెమెన్, మొరాకో, ఇరాక్, ఇండోనేసియా, ఈజిప్ట్, సూడాన్, నైజీరియా, అల్జీరియా, ఇథియోపియా, ట్యునీషియా, జోర్డాన్ దేశాలకు వీసాలు ఇవ్వడం టెంపరరీగా ఆపేస్తున్నట్లు ప్రకటించింది.

చట్టవిరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే ఐదేండ్లు ఎంట్రీ బ్యాన్

పోయినేడాది చాలామంది విజిట్ వీసాతో వచ్చి, వీసాకాలం ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి హజ్‌‌‌‌లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. తద్వారా జనాల రద్దీ పెరిగి, తీవ్ర వేడి, తొక్కిసలాట వంటి ఘటనలు జరిగాయని తేలింది. 2024 హజ్‌‌‌‌ సమయంలో రిజిస్టర్ కాని హజ్‌‌‌‌ యాత్రికుల కారణంగానే తొక్కిసలాట జరిగి 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు గుర్తుచేశారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు విజిట్‌‌‌‌ వీసామీద వచ్చి అక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాటన్నింటినీ కంట్రోల్‌‌‌‌లో పెట్టేందుకు టెంపరరీగా వీసాల జారీని నిలిపివేస్తున్నామని చెప్పారు. చట్టవిరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే ఐదేండ్లపాటు సౌదీలోకి అడుగు పెట్టకుండా చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు.