ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో నస్రల్లా వారసుడు సఫీద్దీన్ మృతి!

ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో నస్రల్లా వారసుడు సఫీద్దీన్ మృతి!

జెరూసలేం: బీరుట్​పై ఇజ్రాయెల్ ​గురువారం రాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో హసన్  నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ ​హతమైనట్టు సౌదీ మీడియా అల్​హదత్ వెల్లడించింది. నస్రల్లాను హతమార్చిన వారంలోనే హెజ్బొల్లాకు కాబోయే కొత్త బాస్​ను కూడా మట్టుబెట్టినట్టు పేర్కొంది. దక్షిణ బీరుట్​లో ఇజ్రాయెల్​డిఫెన్స్​ ఫోర్స్(ఐడీఎఫ్​) జరిపిన ఎయిర్​స్ట్రైక్స్​లో సఫీద్దీన్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. హెజ్బొల్లాకు చెందిన టాప్​లీడర్స్​తో సఫీద్దీన్​ బంకర్​లో సమావేశం అవుతున్నారనే పక్కా సమాచారంతో ఐడీఎఫ్ అటాక్​ చేసినట్టు పేర్కొంది. బీరుట్​లోని దాహియా శివారులో ఈ దాడి జరిగినట్టు సదరు వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, సఫీద్దీన్​మృతిపై అటు ఇజ్రాయెల్​గానీ, ఇటు హెజ్బొల్లాగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, ‘మీ అనుచరులను తీసుకొని లెబనాన్​ను ఖాళీ చేయండి’ అంటూ  నస్రల్లాతోపాటు సఫీద్దీన్​ ఫొటోలతో ఇరాన్​ సుప్రీం లీడర్ ​ఖమేనీని హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ ​విదేశాంగ మంత్రి కట్జ్​ ట్వీట్​ చేశారు.

ఉత్తర లెబనాన్ పై మళ్లీ దాడులు..

హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. శనివారం కూడా ఉత్తర లెబనాన్​పై ఐడీఎఫ్​ విరుచుకుపడింది. ఈ దాడిలో హమాస్​కు చెందిన కీలకనేతతోపాటు అతడి కుటుంబ సభ్యులు హతమయ్యారు. దాడులపై ఉదయం మూడుసార్లు హెచ్చరికలు జారీచేసిన ఐడీఎఫ్.. ఆపై దాడులు ప్రారంభించింది. ట్రిపోలిలోని శరణార్థుల శిబిరం​పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో హమాస్​కు చెందిన అల్​ఖసమ్ బ్రిగేడ్​ సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతిచెందాడు. అతల్లాతోపాటు ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా చనిపోయారని హమాస్​కు చెందిన మీడియా వెల్లడించింది. కాగా, ఈ దాడిపై ఐడీఎఫ్ ​స్పందించలేదు.

ఇరాన్​ అణు కేంద్రాలపై దాడి చేయండి: ట్రంప్​

ఇరాన్– ఇజ్రాయెల్​మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్​ ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్​లోని అణుస్థావరాలను పేల్చేయాలని ఇజ్రాయెల్​కు సూచించారు. నార్త్​ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

హెజ్బొల్లా హెడ్​క్వార్టర్​పై  దాడి చేశాం: ఐడీఎఫ్

దక్షిణ లెబనాన్ మసీదులోని హెజ్బొల్లా హెడ్​క్వార్టర్​పై వైమానిక దాడులు జరిపినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. సలాహ్​ ఎహండోర్​ దవాఖానకు సమీపంలోని మసీదులో స్థాపించిన హెడ్​క్వార్టర్​లోని కార్యకర్తలపై అమ్మన్, నార్త్ ​కమాండ్​ ఇంటెలిజెన్స్​మార్గదర్శకత్వంలో ఎయిర్​స్ట్రైక్స్ చేసినట్టు హిబ్రూ భాషలో ఐడీఎఫ్ ​ట్వీట్ చేసింది.