నేపాల్ లో టేకాఫ్ అవుతూ.. కుప్పకూలి పేలిపోయిన విమానం

నేపాల్ లో టేకాఫ్ అవుతూ.. కుప్పకూలి పేలిపోయిన విమానం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మాండ్ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. శౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం.. 2024, జూలై 24వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పోఖారాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో.. సాంకేతిక లోపంతో అదుపు తప్పింది. ఆ వెంటనే పైకి వెళుతున్న విమానం.. ఎయిర్ పోర్టు రన్ వే పైనే కుప్పకూలింది. ప్రమాదం తర్వాత విమానం పేలిపోయినట్లు చెబుతున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితోపాటు 19 మంది ఉన్నారు. 

ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది, ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. విమానంలోని 19 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నేపాల్ ప్రభుత్వం మాత్రం ఐదుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించింది. 

విమాన ప్రమాదం తర్వాత ఖాట్మాండ్ ఎయిర్ పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఫ్లయిట్ కెప్టెన్ ను ఆస్పత్రికి తరలించినట్లు ప్రకటించారు. చనిపోయిన వారు ఎవరు.. వారిలో భారతీయులు ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.