
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో జనవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో నమోదయ్యే రికార్డు ఎండలు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయి. ఉక్కపోత అధికమవడంతో విద్యుత్ వాడకం పెరుగుతోంది. ఎండ, వేడి నుంచి రిలీఫ్ పొందడానికి జనాలు పగలు.. రాత్రి ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వాడేస్తున్నారు. దీంతో విద్యుత్వినియోగం పెరిగి ప్రభుత్వం 200 యూనిట్ల లోపు కల్పిస్తున్న రాయితీ కోల్పోయే అవకాశం ఉంది. అలాగే, కరెంటు బిల్లు వేలల్లో వచ్చే చాన్స్ఉంటుంది. ప్రభుత్వ పథకం వినియోగించుకోవాలన్నా, బిల్లు భారం నుంచి గట్టెక్కాలన్నా కరెంట్ ను పొదుపుగా వాడుకోవడం ఒక్కటే మార్గం. దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఎర్ర బల్బులు మార్చెయ్యండి
కరెంటు బిల్లు రావడానికి మనం ఇంట్లో వాడే కొన్ని బల్బులు కారణమవుతాయి. ఒకవేళ మీ ఇండ్లలో 60 వాట్స్,100 వాట్స్ ఫిలమెంట్ బల్బులు ఉన్నట్టయితే వెంటనే తీసేసి తక్కువ వాట్స్ఉన్న ఎల్‌ఈడీ బల్బులు వాడాలి. ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు కూడా 40 వాట్స్ తో ఉంటాయి. దీనివల్ల కూడా కరెంట్ఎక్కువ కాలే అవకాశం ఉంటుంది. అందుకే 9 వాట్స్నుంచి 18 వాట్స్‌లోపు ఎల్‌ఈడీ లైట్లు, ట్యూబ్‌లైట్లు వాడితే మేలు. వీటి ధర కొంచం ఎక్కువైనా లైఫ్‌టైం ఎక్కువగా రావడంతోపాటు నెలవారీ యూనిట్లను తగ్గించడంలో సాయపడతాయి.
బీఎల్ డీసీ ఫ్యాన్లు మేలు..
ఒక్కసారి ఫ్యాన్బిగించామంటే దాన్ని పదేండ్ల వరకూ వాడతాం. వీటి వల్ల కూడా కరెంటు బిల్లులు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పాత ఫ్యాన్ వాడుతున్నట్టయితే దాన్ని మార్చెయ్యడం బెటర్ఆప్షన్. సాధారణంగా ఇలాంటి ఫ్యాన్లు100 –-140 వాట్స్ కరెంటును తీసుకుంటాయి. ఇప్పుడు మార్కెట్లో దొరికే బీఎల్ డీసీ ఫ్యాన్లు బిగించుకుంటే 30 నుంచి 40 వాట్స్ మాత్రమే కరెంట్ వాడతాయి. దీనివల్ల చాలా వరకు పవర్ సేవ్ అవుతుంది.
ఏసీల టెంపరేచర్ ఎంత ఉండాలంటే..
ఎండా కాలంలో ఏసీల వాడకం సర్వసాధారణం. కానీ, ఏసీ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని భయపడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీ వాడినా తక్కువ బిల్లు వచ్చేలా చేసుకోవచ్చు. రూమ్చిల్గా ఉండాలని చాలా మంది ఏసీని16 నుంచి 20లోపు పెడతారు. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రకారం మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు మాత్రమే. అందుకే ఏసీలను 24 డిగ్రీల నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతో పాటు కరెంట్బిల్లు తగ్గుతుంది.
టైమర్ ఉపయోగించాలి
ఏసీల్లో టైమర్ఆప్షన్ఇంపార్టెంట్. రాత్రంతా ఉపయోగించకుండా ఈ టైమర్‌ను సెట్ చేసుకోవడం ఉత్తమం. పడుకునే ముందు నుంచి 2–-5గంటల పాటు ఏసీ నడిచి ఆగిపోయేలా టైమర్ పెట్టుకుంటే విద్యుత్తు బిల్లును తగ్గిస్తుంది.
రిఫ్రిజిరేటర్లో ఇలా చేయండి..
రిఫ్రిజిరేటర్లలో చల్లదనం పెంచడానికి, తగ్గించడానికి ఆప్షన్స్ఉంటాయి. దీన్ని మ్యాగ్జిమమ్పెట్టకుండా రిఫ్రిజిరేటర్లో ఉన్న ఆహార పదార్థాలకు అనుగుణంగా సెట్చేసుకుంటే మంచింది. అలాగే, రిఫ్రిజిరేటర్లో మంచు పొరలు పావు వంతు పెరిగినట్లు అనిపిస్తే డీప్రాస్ట్ అనే ఆప్షన్‌తో తొలగించాలి.
ఇన్వర్టర్ ఏసీ బెటర్ ఆప్షన్
సాధారణ ఏసీ వాడేవారు ఇన్వర్టర్ ఏసీకి మారితే కరెంట్బిల్లు కట్టే గండం నుంచి గట్టెక్కవచ్చు. ఇప్పుడు మార్కెట్లోకి ఎక్కువగా ఇన్వర్టర్ఏసీలు వస్తున్నాయి. చాలామంది వీటిని వాడుతున్నారు కూడా.. మామూలు ఏసీలు ఒక టెంపరేచర్సెట్చేసి పెట్టగానే రూమ్ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకున్నా బయట కంప్రెషర్తిరగడం మాత్రం ఆగదు. దీనివల్ల బిల్లు తడిసి మోపెడవుతుంది. అదే ఇన్వర్టర్ఏసీలు అయితే మనం సెట్చేసుకున్న టెంపరేచర్‌కు రూమ్ఉష్ణోగ్రత చేరుకోగానే బయట కంప్రెషర్తిరగడం ఆగిపోతుంది. అలాగే రూమ్ టెంపరేచర్పెరగ్గానే కంప్రెషర్ఆటోమెటిక్గా రన్అవుతుంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు మళ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు లోడ్ పెరిగిపోతుంది. ఇది కరెంట్ వైర్లపై ప్రభావం చూపించడమే కాకుండా, విద్యుత్వినియోగాన్ని కూడా పెంచుతుంది. ఇన్వర్టర్ఏసీల వల్ల ఈ సమస్య ఉండదు. అలాగే సమ్మర్ ప్రారంభంలోనే ఏసీలను మెకానిక్ కు చూపించి, ఫిల్టర్లు శుభ్రం చేయించడంతోపాటు గాలి ఫ్లోటింగ్ సరిచేయించాలి.
మరికొన్ని సలహాలు
ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఎల్‌ఈడీ
బల్బులు, రిఫ్రిజిరేటర్లు తదితర గృహోపకరణాలు బీఈఈ రేటింగ్ 1 నుంచి 5 స్టార్లతో విక్రయిస్తున్నారు. 5 స్టార్ ఉంటే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది.
అవసరం లేని టైంలో కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు బంద్చేయాలి. ఫోన్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఛార్జర్‌ను ప్లగ్ నుంచి తొలగించాలి. ఏ ఎలక్ట్రికల్ వస్తువయినా వినియోగించకపోతే పవర్ ఆఫ్ చేయాలి.
చాలా మంది ప్రజలు ఏసీని రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తుంటారు. కానీ, అలా చేయకూడదు. దాంతో కంప్రెషర్ ఐడియల్ లోడ్ కండిషన్‌లోకి వెళ్లి పవర్ వినియోగిస్తూనే ఉంటుంది. దాంతో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. డైరెక్ట్ స్విచ్ బోర్డు నుంచి ఆన్ ఆఫ్ చేస్తే పవర్ వినియోగం తగ్గుతుంది.