మా బతుకులు ఆగమైతున్నయ్!

  • కరీంనగర్ డెయిరీ కష్టాల నుంచి కాపాడండి
  • పీసీబీ ఆఫీసుకు వెళ్లి ఆందోళనకు దిగిన స్థానిక ప్రజలు 
  • ఇప్పటికే పలుమార్లు డెయిరీ ఎదుట ఆందోళన 
  • రెండు నెలల్లో పరిష్కరిస్తామన్న పీసీబీ ఆఫీసర్లు

కరీంనగర్, వెలుగు :  కరీంనగర్ డెయిరీ సమీప ప్రాంతాల ప్రజలు మరో సారి రోడ్డెక్కారు. డెయిరీ నుంచి వచ్చే కంపును భరించకలేకపోతున్నామని ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకుల చర్యలతో గ్రౌండ్ వాటర్ కలుషితమై అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు వెళ్లిన బాధితులు తమను డెయిరీ బారి నుంచి కాపాడాలని పీసీబీ ఆఫీసర్లను కోరారు. కార్పొరేషన్16వ డివిజన్ పరిధిలోకి వచ్చే డెయిరీ చుట్టూ పలు కాలనీలు ఉండగా.. దశాబ్దకాలం నుంచి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇష్టానుసారంగా వ్యవహరించడమేగాక స్థానికులను బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

వ్యర్థాలను రీసైక్లింగ్ చేయకుండానే..  

 డెయిరీ నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేయకుండా పరిసర ప్రాంతాల్లోని భూమిలో ప్రొక్లెయినర్ తో గొయ్యి తీసి పాతిపెడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితం కావడంతో చర్మవ్యాధుల బారినపడుతున్నామని పేర్కొంటున్నారు. నీళ్లు తాగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గేట్లు సైతం పనికిరాకుండా పోతున్నాయం టున్నారు. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కారణంగా ఇండ్లలో బోరు నీటిలో టీడీఎస్ లెవల్ 3500గా ప్రమాదకర స్థాయిలో ఉందని స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తెలిపారు. బోరు నీటి ని ఇంటి అవసరాలకు కూడా వాడుకునేందుకు అనువుగా లేవని చెప్పారు. 

వ్యాధుల బారిన పడుతున్న స్థానికులు 

డెయిరీ నుంచి వెలువడే వ్యర్థాలతో పద్మానగర్, రాంనగర్, మంకమ్మ తోట వరకు భరించలేని కంపు వస్తోంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కూడా స్థానికులకు ఇబ్బందిగా మారింది. డెయిరీ చిమ్నీ నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి. దాని నుంచి వెలువడే బూడిద గాలిలో కలిసి ఇండ్లపై పేరుకుపోతోంది. అంతేకాకుండా ఇండ్లలోకి చేరుతుండగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ, అస్తమా వంటి వ్యాధుల బారి న పడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. 

పీసీబీ ఆఫీసర్ల విచారణ  

డెయిరీ ముందు గత సెప్టెంబర్10న స్థానికులు ఆందోళనకు దిగారు.  స్పందించిన పీసీబీ అధికారులు విచారణ చేపట్టారు. డెయిరీని పరిశీలించి దుర్వాసన వస్తున్నది  వాస్తమేనని నిర్ధారించారు. గ్రౌండ్ వాటర్ లో టీడీఎస్ ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. వాయు, నీటి కాలుష్యమయంతో సమీప కాలనీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఒక నివేదికను పీసీబీ మెంబర్ సెక్రటరీకి ఇటీవల అందజేశారు. దానిపై స్పందించిన మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి నాయక్ శుక్రవారం రివ్యూ నిర్వహించారు. డెయిరీతో పడుతున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తెలిపారు.