అస్సలు లేట్ చేయడం లేదుగా.. హర్యానాలో ఇండిపెండెంట్లంతా బీజేపీలోకి జంప్..

అస్సలు లేట్ చేయడం లేదుగా.. హర్యానాలో ఇండిపెండెంట్లంతా బీజేపీలోకి జంప్..

చండీగర్: ఎన్నికల ఫలితాలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వస్తే ఆ రాజకీయ పార్టీలోకి జంప్ అవడం ఇటీవల పరిపాటిగా మారింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా అధికార పార్టీలోకి కొందరు ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు. హర్యానాలో కూడా తాజాగా అదే జరిగింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి 24  గంటలు కూడా గడవక ముందే రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికార బీజేపీలో చేరిపోయారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్‌‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి, దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందిన సావిత్రి జిందాల్ గెలుపొందారు. ఆమె బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె మొత్తం 49,231 ఓట్లు సాధించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని గంటల్లోనే ఆమె బీజేపీకి మద్దతు ప్రకటించారు. 

ALSO READ | విషం వ్యాప్తి చేస్తోంది: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

దేవేందర్ కద్యాన్, రాజేష్ జున్ అనే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరిపోయారు. ఈ ఇద్దరిలో కద్యాన్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గనౌర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బహదూర్గర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన రాజేష్ జున్ తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. హర్యానాలో గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలంతా క్షణం ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరిన పరిణామం ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని దక్కించుకుని బీజేపీ హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి హ్యాట్రిక్ విజయంతో కమలం పార్టీ సత్తా చాటింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగగా.. ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా బీజేపీ 48 సీట్లతో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైపోయింది. ఐఎన్ఎల్డీ 2 సీట్లను, ఇండిపెండెంట్లు 3 సీట్లను గెలుచుకున్నారు. ప్రస్తుతం గెలిచిన 3 ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో హర్యానా అసెంబ్లీలో కమలం పార్టీ బలం 51కి చేరుకుంది.