ఆసిఫాబాద్, వెలుగు: కెరమెరి మండలం సావర్ ఖేడ గవర్నమెంట్ స్కూల్ లో స్వచ్ఛందంగా టీచింగ్ చేస్తున్న టీచర్ కడెర్ల వీణ సావిత్రిబాయి ఫూలే అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 7న మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో క్షత్రియ కోసరే మాలీ సమాజ్ ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో ఆమె అవార్డు అందుకోనున్నట్లు అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న 36 మంది ప్రముఖులను సన్మానించనుండగా అందులో కడెర్ల వీణ ఉన్నారని చెప్పారు. సావర్ ఖేడ గ్రామంలోనే నివాసముంటూ వీణ గత పదేండ్లుగా స్వచ్ఛందంగా తెలుగు పాఠాలు చెప్తున్నారు. దీంతోపాటు గ్రామ అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ ఇంటి వద్ద స్టూడెంట్లకు పాఠాలు బోధిస్తున్నారు. వీణ చేస్తున్న ఈ సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు.