కనీస హక్కులకైనా నోచుకోకుండా బానిసలుగా బతుకుతున్న మహిళా లోకానికి బాసటగా నిలిచింది క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే. 1848లో మొదటి బాలిక పాఠశాలను ఏర్పాటు చేసి అఖండ భారతదేశంలో ఫస్ట్ టీచర్ అయింది. ఆనాటి సమాజంలో దళితులకు, స్త్రీలకు విద్య నేర్పడం ధర్మవిరుధ్దం. బాలికలు పాఠశాలకు రావడాన్ని తిరుగుబాటు చర్యగా భావించేవారు. అలాంటి సనాతన కట్టుబాట్లను ఎదిరించి పట్టువదలక దళితులకు, బాలికలకు విద్యనందించిన చదువుల తల్లి సావిత్రిబాయి. ప్రతి మనిషి గౌరవంగా, సాధికారికంగా విద్య ఒక ఆవశ్యకవనరు అని బలంగా నమ్మింది. కనుకనే కింది కులాల వారికి , మహిళలకు చదువు ఎంత ముఖ్యమో నొక్కి చెప్పింది చెప్పడమే కాదు 18 పాఠశాలలు స్థాపించి విద్యావాప్తికి విశేషంగా కృషి చేసింది.
ఉపాధ్యాయురాలిగా సావిత్రి బాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికి ఆచరణీయం. మధ్యాహ్న బోజన పథకం, అందరికీ విద్య , పేరెంట్స్ మీటిం గ్ లు, సంక్షేమ హాస్టళ్లు, బోర్డింగ్ స్కూళ్లు వంటివి 170 ఏళ్లకు పూర్వమే ఆమె విజయవంతంగా అమలు చేసిం ది. దళితవాడల్లో గుడిసె గుడిసెకు తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే ఈనాటి ‘బడి బాట’ కార్యక్రమాన్ని ఆనాడే చేసింది. డ్రాపవుట్లను తగ్గించడం కోసం బడికి రాని విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడేది. విద్యార్థుల గైర్హాజరీకి కారణాలు తెలుసుకునేది. ఒక వేళ పిల్లలు అనారోగ్యానికి గురయితే ఆసుపత్రికి తీసుకెళ్లేది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించేది. ఆమె స్థాపించిన స్కూళ్లు హాస్టళ్ల మాదిరిగా పనిచేసేవి.
తొలి తరం స్త్రీవాది
సమాజంలోని పాతకాలపు భావజాలంపై తీవ్ర పోరాటం చేసింది సావిత్రిబాయి. బ్రాహ్మణ విధవరాండ్లకు గుండు కొట్టించి చీకటి గదుల్లో బంధించే అనాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. వితంతు పునర్వివాహాలు జరిపించింది. పూజారులు లేకుండా వివాహాలు జరిపించింది. దేశంలో మొట్టమొదటిసారి ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏర్పా టు ఆమెదే. మహిళా సేవా మండలి ఏర్పాటు చేసి, కులాలకతీతంగా మహిళలకు స్థానం కల్పించింది. స్త్రీల అస్తిత్వాన్ని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న సమస్యలపై బాధిత మహిళలకు అండగా నిలబడింది. బాల్య, యవ్వన వితంతువులపై జరిగే సెక్సువల్ హెరాస్‌మెంట్‌ని ఖండించింది. అత్యా చారాలతో గర్భవతులైనవారు అబార్షన్లకు, ఆత్మహత్యలకు పాల్పడేవారు. అలాంటివారిని చూసి చలించి న సావిత్రిబాయి ‘బాల్యహత్య ప్రతిబంధక్ గృహ’ను స్థాపించి ఆశ్రయం కల్పించింది. కాశీబాయి అనే వితంతువు కుమారుడిని దత్తత తీసుకొని యశ్వం తరావుగా పేరుపెట్టి పెంచుకుంది. అతడు డాక్టరయిన తర్వాతమాలి కులానికి చెందిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అంటరానితనంలో మగ్గే బడుగులకోసం తన ఇంట్లోనే బావిని తవ్వించి మంచినీళ్లు అందించింది. పుణే నగరం తీవ్ర కరువు బారినపడి తిండి గింజలకు కటకటలాడుతుం టే, 52 ఆహార కేంద్రాల ద్వారా వేలాది మందిని ఆదుకున్న అన్నపూర్ణ. ఈ ఆహార కేంద్రాలు హాస్టళ్లుగా పనిచేశాయి. సావిత్రిబాయిని చాలామంది మహాత్మ జ్యోతిరావు ఫూలే భార్యగానే గుర్తిస్తారు. కాని, ఆమె భర్త అడుగుజాడల్లో సడుస్తూనే స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. భర్త మరణానంతరం ఆయన ఆశయాలను అన్నీ తానై కొనసాగించింది. సత్యశోధక్ సమాజ్ కి తొలి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి. సావిత్రిబాయి తొలి తరం రచయిత్రి, కవయిత్రి. ఈమె రచించిన కవితల సంపుటి ‘కావ్యపూల్’, ‘బవన్న కాశి’, ‘సంబోధి రత్నాకరం’. వంటివి, జ్యోతిబాకి రాసిన లేఖలు చదివినట్లయితే విద్యపట్ల, సమాజం పట్లగల నిబద్ధతకు అద్దం పడతాయి. జ్యోతిబా ఫూలే రాసిన అనేక వ్యాసాలను ప్రచురించి సంపాదకురాలిగాకూడా తన ప్రతిభను చాటుకుం ది. భర్త మరణించి నప్పుడు సనాతన ఆచారాలకు విరుద్ధం గా ఆయన చితికి నిప్పు పెట్టి నిజమైన అభ్యుదయ భావాలు కలిగి న సంస్కరణ వాదిగా సావిత్రి బాయి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిం ది. చివరకు మహరాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు తన కొడుకుతో కలిసి పేదలకు వైద్య సహాయం అందించింది.