సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్​ టీచర్స్​ డే

సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్​ టీచర్స్​ డే
  • స్టేట్​ ఫంక్షన్​గా నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • నేడు సావిత్రిబాయి పూలే జయంతి.. ఆమె త్యాగాలను గుర్తు చేసుకున్న సీఎం

హైదరాబాద్, వెలుగు:సావిత్రిబాయి పూలే జయంతిని ఇక నుంచి ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని, ఇందుకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సీఎస్​ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఈ పండుగను ‘స్టేట్ ఫంక్షన్​’ గా జరపాలని కలెక్టర్లను సీఎస్  ఆదేశించారు.కాగా.. ‘ఉమెన్​ టీచర్స్​ డే’ ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్​లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంఈవోలకు  డైరెక్టరేట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ సూచించింది. సావిత్రిబాయి పూలే సేవలను విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది. 

సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. పూలే దంపతుల సేవలను, త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రి బాయి ఫూలే పునాది వేశారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించారు. అణచివేతలకు గురైనవారికి న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.

శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సావిత్రీబాయి ఆశయాలను సాధించేందుకు ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. మహిళల సాధికారతకు పెద్దపీట వేయటంతో పాటు, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించే నైపుణ్యాల వృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం.

బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి పాటుపడే భవిష్యత్తు ఆలోచనలతో రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసింది. మహిళలను అక్షరాస్యులను చేయడానికి సావిత్రిబాయి పూలే ఎంతో శ్రమించారు. ఆమె త్యాగాన్ని, కృషికి గుర్తింపుగా రాష్ట్రవ్యాప్తంగా ఏటా సావిత్రిబాయి పూలే జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుందాం” అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. 

ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

అణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గారిన మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల జీవితాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అక్షర చుక్కాని సావిత్రిబాయి పూలే అని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​, టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.