
- బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్స్
- మొదట కొంత లాభాలు చూపి.. ఆపై ముంచుతున్న మోసగాళ్లు
- ఈ దందాపై ‘నా అన్వేషణ’, ‘రామ బాయ్’ వంటి నెటిజన్ల పోరు
- పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్
- ట్రెండింగ్‌లో #SayNoToBettingApps
- బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవాళ్లపై చర్యలకు సర్కార్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలో వేల రూపాయలు మన అకౌంట్లో చూపెడ్తరు..! కూర్చున్న దగ్గర్నే.. అదీ గంటల్లోనే లక్షాధికారి కావొచ్చని, కోటీశ్వరులు అయిపోవచ్చని.. మనకు ఎక్కడలేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి.. మన బతుకులను రోడ్డు మీదికి ఈడుస్తారు.. ఇదీ బెట్టింగ్ యాప్స్ దందా!! ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా.. యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని.. బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడంపైనే గంటలకు గంటలు టైమ్ వెచ్చిస్తున్నారు.
చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్వల్ల అప్పలుపాలై రాష్ట్రంలో నిరుడు వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతోపాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో యాప్స్‌ను ప్రమోట్ చేయించుకుంటూ.. సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నది. వీటిని ప్రమోట్ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఒకరిద్దరితో పోరాటం మొదలై..!
#SayNoToBettingApps.. ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా నెటిజన్లు చేస్తున్న పోరాటం ఇది. బెట్టింగ్ యాప్స్ తో అప్పుల పాలై కుటుంబాలు రోడ్డు మీదికి వస్తుండగా.. కొందరు అప్పులు తీర్చే మార్గాలు తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూ ట్యూబ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంతో వాటి బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది.
ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవాళ్లు ప్రమోట్ చేస్తుండటంతో.. వాళ్లు చెప్పింది నమ్మి డబ్బులకు ఆశపడి ముఖ్యంగా యువత ఆ యాప్స్ లో డబ్బులు పెడ్తున్నారు. మొదట్లో కొంత మొత్తం ఆయా యాప్స్ నుంచి వస్తుండటంతో.. అందుకు ఆశపడి అదే పనిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టాలపాలవుతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా గత ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసువర్గాలు ‘వెలుగు’కు తెలిపాయి. పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగులు పెరిగిపోయాయి. చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ యాప్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశలకు.. అప్పులు చేసి మరీ డబ్బులు పెడ్తున్నారు.
యాప్స్‌ను ప్రమోట్ చేసేవాళ్లకు వారి వారి ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆయా యాప్స్ నిర్వాహకులు రూ.లక్షల్లో చెల్లిస్తున్నాయి. జనం జీవితాలను బలితీసుకుంటున్న ఈ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా ‘నా అన్వేషణ’, ‘రామ బాయ్’ లాంటి కొందరు ఇటీవల సోషల్ మీడియాలో పోరాటం మొదలు పెట్టారు. యాప్స్ ను అడ్వర్టయిజ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మద్దతుగా నిలిచారు.
ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచిస్తున్నారు. #SayNoToBettingApps కు అందరూ కలిసి రావాలని కోరుతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది. చాలా మంది పోరాటంలో కలిసి వస్తున్నారు.
కేసులు.. ప్రత్యేక మానిటరింగ్
బెట్టింగ్ యాప్స్ దందాను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బెట్టింగ్ , గేమింగ్స్ యాప్స్ పేరుతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై ఇటీవల కేసులు కూడా నమోదయ్యాయి. వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ వంటి వారు ఉన్నారు. తాజాగా హర్షసాయి అనే యూట్యూబర్పైనా కేసు ఫైల్ అయింది.
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించి, ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వహణపై మానిటరింగ్ చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించి, వాటిని టెక్నాలజీ సాయంతో అడ్డుకట్ట వేయాలని, యాప్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చర్యలతో దిగివస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ప్ల్యుయెన్సర్స్.. క్షమాపణలు చెప్తూ వీడియోలు చేస్తుంటే, మరికొందరు మాత్రం గతంలో తాము చేసిన బెట్టింగ్ యాప్స్ వీడియోలను, అకౌంట్స్ ను తొలగిస్తున్నారు.