హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ వినియోగం మంచిది అనుకుని భ్రమపడేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఉన్నత విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ, యాంటీ ర్యాగింగ్ పై శనివారం మాసబ్ ట్యాంక్‌లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్‌ఏయూ) ఆడిటోరియంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరై మాట్లాడారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్లకు అది ఒక వ్యాపారమని, కానీ సామాన్యులు ఎందుకు ఆ ఊబిలోకి దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. మరో ప్రధానమైన సమస్య ర్యాగింగ్ అని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు విద్యా శాఖ, పోలీసు శాఖ కలిసి పనిచేస్తున్నాయన్నారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల వృద్ధిపై డ్రగ్స్ ప్రభావం చూపిస్తున్నాయన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ.. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్పితే ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం ఉంటే 87126 71111 నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ఎస్కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.