
- జాతి, సంస్కృతి నాశనం చేసేందుకే భాషలపై దాడి: స్టాలిన్
- తమిళనాడులో ఆ పరిస్థితి రానివ్వమన్న సీఎం
చెన్నై: హిందీని బలవంతంగా రుద్దడం వల్ల నార్త్ ఇండియాలో గత 100 ఏండ్లలో 25 స్థానిక భాషలు కనుమరుగయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. భోజ్‌పురి, మైథిలీ, అవధి, బ్రజ్, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి తదితర భాషలు అవసాన దశకు చేరాయంటూ గురువారం ‘ఎక్స్’లో పోస్ట్చేశారు.
జాతి, సంస్కృతిని నాశనం చేయడానికే భాషలపై దాడి చేస్తున్నారని తెలిపారు. తమ రాష్ట్రంలో ఆ పరిస్థితి రానిచ్చేదే లేదన్నారు. త్రిభాష విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అములు చేయబోమని.. ద్విభాషా విధానమే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కుంభమేలా, తమిళ సంగం(కాశీ)లో దక్షిణ భారతదేశ భాషల్లో ఎన్ని బోర్డులు పెట్టారో మోదీని ప్రశ్నించాల్సిందిగా పేర్కొన్నారు.
‘‘ హిందీ ఎన్నడూ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల హర్ట్ల్యాండ్కాదు. వారి నిజమైన భాషలు ఇప్పుడు అవశేషాలుగా మారాయి. మహా కుంభ్, తమిళ సంగమం (వారణాసిలో) సమయంలో దక్షిణ భారత భాషల్లో ఎన్ని బోర్డులు పెట్టారని ప్రధాని నరేంద్ర మోదీని అడగాలి” అని స్టాలిన్ పేర్కొన్నారు.కాగా, గురువారం స్టాలిన్‘ఎక్స్’లో చేసిన పోస్టుపై బీజేపీ స్పందించింది. ఆయన చేసిన కామెంట్లు చాలా సిల్లీగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.