విశ్లేషణ: రైతులకు ఉరే గతి అన్న కేసీఆర్ ఎట్ల వరి వేసిన్రు?

‘వరి వేస్తే ఉరే.. మీ పంటకు మీరే బాధ్యులు’ అని రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. కానీ, తన ఫాంహౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి పంట వేశారు. వరి పండించవద్దని చెప్పిన మాట రైతులకే వర్తిస్తుందా? కేసీఆర్​కు అది వర్తించదా? ఇప్పుడు రాష్ట్ర రైతాంగం అడుగుతున్న ప్రశ్న ఇదే. వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న కేసీఆర్​.. తాను ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతను మరిచిపోయారు. కేంద్రం బాయిల్డ్​ రైస్​ కొనబోమని రా రైస్​ కొంటామని చెపితే.. బాయిల్డ్​ రైస్​ కొనాల్సిందే అంటున్న టీఆర్ఎస్ సర్కారు.. కేంద్రం వరి కొనడం లేదంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రైతులు అరిగోస పడుతున్నా.. రాజకీయంగా వాడుకోవడానికి చూస్తుందే తప్ప వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు.

ఈ యాసంగిలో వరి వేస్తే మా ప్రభుత్వం కొనదు. వరి వేస్తే ఉరే గతి అని ప్రచారం చేసిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరి వేసిండని, ఆయన కూడా ఉరి వేసుకుంటడా? అని ప్రతిపక్ష నాయకులు రుజువులు చూపి నిలదీసిన్రు. ఒకవైపు కేంద్రం మాకు బియ్యం కోటా ఇంకా నింపలేదని పార్లమెంట్​లో చెప్పింది. మరోవైపు రైతులు కొనేవారు లేక, ఏం చేయాల్నో తోచక వడ్ల కుప్పల మీద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గోడౌన్ల కొరత లేదన్నది. సంచుల కొరత లేదన్నది. డబ్బు కొరత లేదన్నది. అయినా వడ్లు మాత్రం కొన లేదు. బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వలేదు. ఈ లొల్లితో రైతులకు, ప్రజలకు ఒక విషయం అర్థమైంది. ఇంతదాకా కేసీఆరే అన్నీ కొంటున్నాడని భ్రమ ఉండేది. అయితే వాటిని కొనేది కేంద్రమని, ప్రతి పైసా కేంద్రం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆయా రాష్ట్రాలకు పంపిస్తుందని అందరికీ తెలిసింది.

వరి పండించడం ఈజీ అయిపోయింది

ఉప్పుడు బియ్యం ఇంతకన్నా ఎక్కువ తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం, ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే అసలు వడ్లే కొనమని రాష్ట్ర ప్రభుత్వం గత కొద్దిరోజలుగా వాదించుకుంటున్నాయి. వాస్తవానికి వరి పండించడం ఇప్పుడు ఈజీ అయిపోయింది. మిగతా ఏ పంటలుపండించాలన్నా ఎక్కువగా కష్టపడాలి. ఈ తత్వం పెరిగిపోవడంతో నూనెగింజలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్ అని పిలిచే కొర్రలు, జొన్నలు, ఊదలు, ఉలవలు మొదలైనవి పండించడం బాగా తగ్గిపోయి అసమతుల్యత ఏర్పడింది. 
దీంతో వీటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటల వైవిధ్యం ఆవశ్యకతను రైతులు, జనంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోలేకపోవడమే ఈ సమస్యలకు అసలు మూలం. కరువు, వరదలు, అనుకోని పరిస్థితులు ఎదుర్కోవడానికి మూడు, నాలుగేండ్లకు దేశానికి సరిపడే ధాన్యం నిల్వలను కేంద్రం రాష్ట్రాల నుంచి సేకరించి గోడౌన్లలో పెడుతుంది. ఇందుకు అవసరమయ్యే నిధులను కూడా కేంద్రమే సమకూరుస్తోంది. కానీ తన సొంత డబ్బులతోనే రైతల నుంచి అన్ని పంటలు కొనుగోలు చేస్తున్నట్టుగా ఇంత కాలం రాష్ట్ర ప్రభుత్వం అందరినీ మభ్యపెట్టింది.

నాలుగేండ్లల్ల అప్పు తీరిపోతదని చెప్పిండు

కాళేశ్వరం గురించి కేసీఆర్ ఎంత ఉబ్బిచ్చిండు? రెండున్నర, మూడు గంటలు తనే మౌస్ జరుపుకుంట సీఎం క్యాంప్​ ఆఫీసుల గోడ మీద సినిమా చూపిస్తే మేమంతా ఉబ్బి తబ్బిబ్బయి పోయినం. గింత అప్పు ఎట్ల తీర్చుడు అని అడిగితే.. అన్నా! పంటలు పండితే నాలుగేండ్లల్ల అప్పు తీరిపోతదని పన్నుల ఎకనమిక్స్​ చెప్పిండు. మళ్లోసారి కొత్త సెక్రటేరియెట్ కు అందరం కొబ్బరికాయలు కొట్టి లంచ్ కు ప్రగతి భవన్ పోయినప్పుడు ఆ ముచ్చట ఈ ముచ్చట అడిగి ఏ మాయె మన కేజీ టు పీజీ గురుకులాల పెంపు, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపకం, ఉద్యోగ నియామకాలు అని అడిగిన. అన్నా! కొద్ది రోజులుగానీ రెండేండ్లల్ల కాళేశ్వరం అప్పులు తీరుతై అన్నడు. అగో అప్పుడు నాలుగేండ్లంటిరి గదా అన్న!.. అన్నా, అప్పుడు ఏడాదికి ఒక పంట అని అనుకున్న లెక్క. ఇప్పుడు రెండు పంటలు తీస్తే రెండేండ్లల్ల నాలుగు పంటలు అని చెప్పి.. అట్ల ప్రభుత్వానికి ఎన్ని రూపాల్లో ఆదాయమొస్తదో ఎకనమిక్స్ చెప్పిండు.

అంచనాలు తప్పాయా? అన్నీ అబద్ధాలేనా?

గిన్ని చెప్పినంక రెండేండ్లు పూర్తయినా.. ఆ ఆదాయమంతా ఎటుపాయె. ఆఖరికి వడ్లు కొనటానికే చాత గాకుండయి పాయె. గిట్లెందుకైంది? చెప్పిన అంచనాలు తప్పినయా? తెలిసి అబద్ధాలతో మెప్పించిండా? వైఎస్ రాజశేఖర్​రెడ్డి జలయజ్ఞాన్ని మనం ధనయజ్ఞం అన్నం. మరి గిదేంది? కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు అధికారంలో ఉన్న వారికి కామధేనువులు. బంగారు గనులు. స్కూళ్లకు, కాలేజీలకు, గురుకులాలకు, డబుల్ బెడ్రూం ఇండ్లకు, బీసీల లోన్లకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఏమొస్తది? అదంతా ఖర్చు. నెలనెలా జీతాలియ్యాలె. గందుకని! సరే ఇదంతా పక్కకు పెడదాం. ఇప్పుడు గిట్ల పరిస్థితి ఎందుకు తిరగవడ్డది? ఇది అనివార్యమా? కృత్రిమంగా సమస్య సృష్టించి వేలాది రైతులను అరిగోస వోసుకొని రాజకీయాల్లో పైచేయి సాధిద్దామనా? 

అన్నీ ఎదురుదెబ్బలే తగలడంతో..

ఏడాది నుంచి ఏమైందంటే.. ఈటల రాజేందర్ ను వదిలించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన అడుగులన్నీ ఈటలను లీడర్ గా మార్చాయి. ఇదే సమయంలో కేసీఆర్ ఫేక్​ ప్రెస్టేజీ రంగు వెలిసిపోతూ వచ్చింది. దేశంలో ఎవరికీ తోచని బ్రహ్మాస్త్రం లాంటి దళితబంధు పథకం కూడా ఉపయోగం లేకుండాపోయింది. విమర్శల జడివానకు భయపడి నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎమ్మెల్యేలు మెచ్చిన వారికిస్తామని ప్రతిపాదించారు. పది లక్షల దళిత బంధు వారికిష్టమైన పెట్టుబడిగా మార్చుకునే వీలులేని విధంగా మార్చారు. హుజూరాబాద్​లో కేసీఆర్​ పాచిక పారి ఉంటే ఈ పాటికి వేరే తీరుగా ఉండేది. కానీ, అడ్డం తిరగడంతో ఏం చేయాలో తోచలేదు. అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ అంశం ముందుకు వచ్చింది. ఇక నుంచి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని, రా బియ్యమే ఇస్తామని సంతకం చేసిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అందరినీ మభ్యపెట్టింది. 

రైస్​ మిల్లులను ఎందుకు ఆధునీకరించలేదు

ఉప్పుడు బియ్యం కేంద్రం వద్దన్న తర్వాత, స్వయంగా సంతకం చేశాక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందేమిటి? ఉప్పుడు బియ్యం రైస్ మిల్లులను ఆధునీకరించేందుకు కృషి చేయాల్సింది. మిగతా పారాబాయిల్డ్ రైస్ మిల్లుల లైసెన్సులను రద్దు చేయాల్సింది. ఈ సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. కానీ తమ సామాజికవర్గాల రైస్ మిల్లర్ల లాబీ గనక వారి ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడింది. వడ్లు అంగట్లకు రాగానే మేం కొనం. కేంద్రం తీసుకుంటలేదు అని ప్రచారం మొదలు పెట్టింది. బియ్యం అనే మాట వదిలి వడ్లు అనే మాట ముందుకు తెచ్చింది. ఫుడ్ కార్పొరేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి బస్తాల్లో నింపి ఎఫ్ సీఐకి ఇవ్వాలె రాష్ట్రం ఈ పని రైస్​ మిల్లుల నెత్తిన పెట్టింది. కనుక రైస్ మిల్లులే బియ్యం కోటాలు పూర్తి చెయ్యాలె. మొన్నటి దాకా ఇట్ల నడిచింది. కానీ, రైస్​ మిల్లులను ఆధునీకరించకపోవడంతో సమస్య వచ్చిపడింది. దానిని కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం మొదలైంది.

కాళేశ్వరం పూర్తి కాకుండానే..

కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్రంలో కోటి టన్నులకు పైగా వడ్లు పండుతున్నాయి. ఇప్పుడే వడ్లు కొనలేకపోతే ఇక కాళేశ్వరం నీళ్లతో పండించిన పంటలను ఏం జేస్తారు? చెరువులు నింపితే, ఉచిత కరెంట్ ఇస్తే గింతగనం పండించినపుడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్టు? మనం వంట నూనెలు రూ.70 వేల కోట్ల దాక దిగుమతి చేసుకుంటున్నాం. నువ్వులు, పల్లి, ఆముదాలు, పొద్దుతిరుగుడు, పామాయిల్, సోయా వంటివి సాగు చేయాలని ఐదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు ఎందుకు చెప్పలేదు? వరి పంట వద్దంటే ఇగ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకని అంటరని తెలిసి మౌనంగా ఉన్నారా? ఆ ప్రాజెక్టు పేరిట లక్ష కోట్లు ఆరగించారు. మా వూరి చెరువు నిండితే మా బావి నిండుతుండె. జల ఎట్ల వస్తుండెనో అసలే తెల్వకపాయె. గట్లనే కాళేశ్వరం బడ్జెట్, పనులు పెరిగిన కొద్దీ అధికారంలో ఉన్న వారి ఖజానాలు నిండినయి. అవి ఎన్నికలు వచ్చినప్పుడు పొంగి పొరలి ఏరులై పారుతున్నయ్. చివరకు ఓటుకు ఆరు వేల రూపాయలు మాకెందుకియ్యలే అని జనం రోడ్డెక్కే కొత్త సంస్కృతికి కేసీఆర్ తెర తీసిండు.

ఎంత మందినైనా బలి చేసేందుకు వెనుకాడరు

ఈ మధ్య రూ.730 కోట్లతో ధర్మపురి లో ఆధునిక రైస్ మిల్లు స్థాపించడంతో తన జన్మ ధన్యమైందన్నడు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ పని కేంద్రం దగ్గర ఉప్పుడు బియ్యం బదులు రా బియ్యం ఇస్తమని సంతకం పెట్టినప్పుడే ఎందుకు మొదలు పెట్టలేదు? ముందుచూపు లేకనా? లేదంటే తమ సామాజికవర్గాల రైస్ మిల్లు ఓనర్ల కోసం రైతులను ఆగమాగం చేసిన్రా? రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీని, అవినీతిపై దండెత్తి వస్తున్న సంస్థలను, కేంద్రాన్ని అడ్డగించి వాటి నుంచి తప్పించుకోవడానికి లోపాయికారీ ఒప్పందాలు కుదిరేదాకా రైతులు బలికానీ అనుకున్నారా? భవిష్యత్తు అన్నింటినీ తేల్చుతుంది. ప్రస్తుతం ఆటలు, డ్రామాలు అన్నీ ముగుస్తున్నాయనిపిస్తున్నది. కేసీఆర్ ఏది చేసినా రాజకీయమే అని గుర్తుంచుకుంటే తన కోసం ఎవరినైనా ఎంత మందినైనా బలి చేయడానికి వెనకాడడని రైతుల పట్ల ప్రవర్తించిన తీరు తేటతెల్లం చేసింది.

- బీఎస్ రాములు, సామాజిక తత్వవేత్త