తెలంగాణలో భూమికోసం సాయుధ రైతాంగ పోరాటం పుట్టింది. దేశంలోనే తొలిసారిగా భూదానోద్యమం కూడా ఇదే గడ్డపై మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని భూములకు సంబంధించిన ఎన్నో చట్టాలు రూపొందాయి. కానీ, ఈ గడ్డపై ఉన్న భూముల చిక్కులు, వివాదాలు దేశవ్యాప్తంగా బహుశా ఏ రాష్ట్రంలోనూ లేకపోవచ్చు. సర్వే నంబర్ కు ఒక గెట్టు తగాదా.. ప్రతి ఊరిలో పదుల సంఖ్యలో భూ పంచాయితీలు ఉంటాయి. భూమి అంటే.. అస్తిత్వ, సామాజిక, ఆర్థిక సెంటిమెంట్ కూడా. దీనిముందు కులాలు, మతాలు, వర్గాలు.. రక్త సంబంధ, బంధుత్వ, వారసత్వ వంటి సెంటిమెంట్లు ఏవీ ఉండవు. భూమికోసం అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, దాయాదులు కొట్టుకుని చంపుకునే ఘటనలు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూలన చూస్తూనే ఉంటాం.
ఇలా ఎందుకంటే.. తెలంగాణలో భూములకు అస్పష్టమైన రికార్డులు ఉండడం. సరిహద్దులు సరిగా లేకపోవడం, కాలానుగుణంగా రికార్డుల్లో మార్పులు చేర్పులు సరిగా చేయకపోవడం. ఇందుకు ఏలిన ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం. ఇక భూముల వివాదాలపై కోర్టుల్లో లక్షల్లో కేసులు నడుస్తున్నాయి. తరతరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. అయినా.. భూముల వివాదాలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోయింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన పట్వారీ వ్యవస్థ నుంచి, స్వరాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెచ్చిన ధరణి పోర్టల్ దాకా కేవలం భూ రికార్డుల్లో ఇటూ అటూ మార్పులు చేశారే తప్ప సమూలంగా ప్రక్షాళనను చేయలేదు.
దశాబ్దాల కిందటి మ్యాపులే దిక్కు..
నిజాంల కాలంలో దశాబ్దాల కిందట చేసిన భూముల సర్వే, రికార్డులే నేటికీ దిక్కు. రాష్ట్రంలో మొత్తం భూమి 1 లక్షా 12 వేల చదరపు కిలోమీటర్లు ఉంటుందని ప్రభుత్వ భూ రికార్డుల లెక్కల ద్వారా తెలుస్తోంది. సుమారు 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి. ఇది వ్యవసాయ, వ్యవసాయేతర భూమిగా ఉంది. అయితే, భూ రికార్డులకు, క్షేత్రస్థాయిలో భూముల లెక్కలకు చాలా తేడాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో కూడా తెలంగాణ, ఆంధ్రకు విడివిడిగా రెవెన్యూ చట్టాలు ఉండేవి.
ఇక తెలంగాణలో నిజాం కాలంలో దశాబ్దాల కిందట సర్వే చేయించి, హద్దురాళ్లు పాతిన సర్వే నెంబర్లు, మ్యాపులే తప్ప నేటికీ ఎలాంటి భూముల రీ సర్వే చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా చేసేందుకు సాహసించలేదు. ఏపీలోనైతే ప్రతి సర్వే నంబరులో మొత్తం భూమికి, సబ్ సర్వే నంబర్ల మ్యాపులతో సహా అందుబాటులో ఉంటాయి. అందుకే తెలంగాణ కంటే ఏపీలో భూ వివాదాలు తక్కువ. అదే తెలంగాణలోనైతే .. సర్వే నంబర్ మొత్తానికి ఒకటే మ్యాపు ఉంటుంది. ఆ సర్వే నంబరులో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఎంతమంది పట్టాదారులు ఉన్నా కేవలం రాళ్ల హద్దులతోనే హద్దులు కలిగి ఉంటారు. ఈ విధానమే భూముల చిక్కులకు, వివాదాలకు కారణమని చెప్పొచ్చు. వాస్తవానికి భూ చట్టాల న్యాయ నిపుణుల ప్రకారం చూస్తే.. ప్రతి 30 ఏండ్లకు ఒకసారి రెవెన్యూ రికార్డులో మార్పులు వస్తాయి. కాబట్టి భూ రీ సర్వే జరగాలనేది ఒక నియమంగా పెట్టారు. కానీ, నిజాం కాలంలో జరిగిన సర్వే రికార్డులే ఇప్పటికీ తెలంగాణ భూములకు ప్రామాణికంగా ఉన్నాయి.
ధరణితో మరింత జటిలం
తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వ నిర్ణయాల్లో సమగ్ర భూ సర్వే ఒకటి. రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమిని వదలకుండా కొలుస్తామని, ప్రతి సర్వే నంబరుకు కచ్చితమైన కొలతలు వేస్తామని, జియోగ్రాఫికల్ గా అక్షాంశాలు, రేఖాంశాలు(లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్) ఆధారంగా పకడ్బందీగా రికార్డులను రూపొందిస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ వారి హయాంలో ప్రకటించింది. భూ రికార్డులను ఎవరూ మార్చలేనివిధంగా డిజిటలైజ్ చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనూ పేర్కొన్నారు. ఇందుకు 2017లో భూ దస్త్రాల ఆధునికీకరణ చేపట్టారు. ఆ తర్వాత 2020లో కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ‘ధరణి పోర్టల్’ను అమలులోకి తెచ్చారు. పోర్టల్ ద్వారా టెక్నాలజీ, అమ్మకం, కొనుగోలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటివి ఈజీ అయ్యాయి. కానీ, ధరణితో భూ రీ సర్వేకు ఎలాంటి రూట్ మ్యాప్ తయారు చేయలేదు. ఇక పోర్టల్ మాత్రం గత ప్రభుత్వానికి ఏటీఎం లెక్క మారిపోయింది. మరోవైపు రికార్డులను అస్తవ్యస్తంగా నమోదు చేయడం తీవ్ర వివాదాలకు దారితీసింది. పాత రెవెన్యూ చట్టాలను రద్దు చేసింది. కొత్త రెవెన్యూ చట్టమే ఫైనల్ గా చట్టంగా మార్చింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినా పట్టించుకోలేదు. పరిష్కారం చూపలేదు. భూ సమస్యలను ఇంకా ఎక్కువ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎలాంటి భూమి ఉంది. అది ఎవరిపేరున ఉంది అనేది ఎక్కడి నుంచైనా.. ఎవరైనా ఈజీగా తెలుసుకునేలా గత ప్రభుత్వం లోపభూయిష్ఠంగా పోర్టల్ ను రూపొందించింది. భూ సమస్యలను మరింత జటిలం చేసింది.
భూముల చిక్కులకు చెక్ పెట్టాలి
రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ధరణి పోర్టల్లోని తప్పొప్పులను సవరించి, సమగ్రంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. కొద్దిరోజులుగా అధికార యంత్రాంగం కూడా అందులో నిమగ్నమైంది. కాగా, 2008లో వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఏపీలో భూ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రీ సర్వే చేసేందుకు నిర్ణయించింది. ఆ దిశగా భూ భారతి ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇందుకు నిజామాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంది. కానీ, వైఎస్ఆర్ మరణాంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మరోవైపు తెలంగాణ మలిదశ ఉద్యమ రావడంతో అది ఆచరణలో ముందుకు పడలేదు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూ రీ సర్వే ప్రాజెక్ట్ పై తక్షణమే ఫోకస్ పెట్టాలి. భూముల వివాదాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా భూ రీ సర్వే ద్వారా ధరణి దరిద్రం వదిలించాలి. రాష్ట్ర ప్రభుత్వం తేనున్న కొత్త రెవెన్యూ వ్యవస్థలో భాగమైన భూమాత పోర్టల్ ను భవిష్యత్ లో వివాదాలు, చిక్కులు తలెత్తనివిధంగా రూపొందించాలి. మొత్తంగా తెలంగాణకు భూమాతగా మార్చాలి. ఇదే రాష్ట్రవ్యాప్తంగా భూ బాధితుల ఆశ కూడా.
వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్