ఈసారి జీడీపీ వృద్ధి 6.3 శాతం.. ఎస్​బీఐ అంచనా

ఈసారి జీడీపీ వృద్ధి 6.3 శాతం.. ఎస్​బీఐ అంచనా

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిని 6.3 శాతంగా అంచనా వేస్తున్నట్టు ఎస్​బీఐ ప్రకటించింది.   ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.2 శాతం – 6.3 శాతం మధ్య ఉండొచ్చని బ్యాంకు విడుదల చేసిన రిపోర్ట్​పేర్కొంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, 2024–-25 సంవత్సరానికి వాస్తవ,  నామమాత్ర జీడీపీ వృద్ధి రేట్లను వరుసగా 6.4 శాతం,  9.7 శాతంగా అంచనా వేసింది.

బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వల్ల అన్ని రంగాలకూ మేలు జరుగుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో మూలధన వ్యయం మెరుగుపడుతోందని పేర్కొంది. భౌగోళిక రాజకీయ పరిణామాలు,  సరఫరా గొలుసు ఇబ్బందుల వల్ల 2024 క్యాలెండర్ సంవత్సరం మూడవ క్వార్టర్​లో మందగమనం భారతదేశాన్ని మాత్రమే కాకుండా ఇతర దేశాలను కూడా ప్రభావితం చేసిందని ఎస్​బీఐ పేర్కొంది.

అయినప్పటికీ,  మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం,  తదుపరి ఆర్థిక సంవత్సరం రెండింటికీ భారతదేశ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్​ అంచనా వేసింది.