న్యూఢిల్లీ: కాంక్రీట్ ఎక్విప్‌మెంట్లను తయారు చేసే అజాక్స్ ఇంజనీరింగ్‌లో రూ.212 కోట్లను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఇన్వెస్ట్ చేసింది. ఐపీఓకి రెడీ అవుతున్న ఈ కంపెనీలో రెండు ఫండ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టింది. ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్, ఎస్‌బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లు కంపెనీ షేర్లు కొన్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 5 న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదిరింది.
ఈ అగ్రిమెంట్ ప్రకారం, 27.02 లక్షల అజాక్స్ ఇంజనీరింగ్ షేర్లను షేరుకి రూ.629 చెల్లించి ప్రమోటర్ జాకబ్ హన్సన్ ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.170 కోట్లు. మరో రూ.42 కోట్ల విలువైన షేర్లను కొనేందుకు ఈ నెల 7న అగ్రిమెంట్ కుదిరింది. అజాక్స్ ఇంజనీరింగ్‌లో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌కు 2.94 శాతం వాటా దక్కుతుంది. అజాక్స్ ఐపీఓ ఈ నెల 10న ఓపెనై, 12న ముగియనుంది.