న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) నికర లాభం కిందటేడాది అక్టోబర్– డిసెంబర్ (క్యూ3) లో 84 శాతం పెరిగింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌లో రూ.9,164 కోట్ల నికర లాభం రాగా, క్యూ3 లో రూ.16,891 కోట్లు వచ్చాయి. నికర వడ్డీ ఆదాయం రూ.39,816 కోట్ల నుంచి 4 శాతం వృద్ధి చెంది రూ.41,445.5 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం మాత్రం 3.65 శాతం తగ్గి రూ.11,040.76 కోట్లుగా నమోదైంది.
మొండిబాకీల కోసం చేసే ప్రొవిజన్లు మాత్రం క్యూ3 లో 32.4 శాతం పెరిగాయి. 2023 డిసెంబర్ క్వార్టర్‌లో రూ.911.06 కోట్లను ప్రొవిజన్ల కోసం కేటాయించిన ఎస్‌బీఐ, క్యూ3 లో రూ. 3,823 కోట్లను పక్కన పెట్టింది. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) రేషియో కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 2.13 శాతం ఉంటే డిసెంబర్ క్వార్టర్‌లో 2.07 శాతంగా రికార్డయ్యింది.
నెట్ ఎన్‌పీఏల రేషియో 0.53 శాతం దగ్గర ఫ్లాట్‌గా ఉంది. ఎస్‌బీఐ ఇచ్చిన లోన్లు ఏడాది ప్రాతిపదికన క్యూ3 లో 13.49 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఎస్‌ఎంఈలకు ఇచ్చిన లోన్లు 18.7 శాతం వృద్ధి చెందగా, వ్యవసాయ రుణాలు 15.31 శాతం, కార్పొరేట్ రుణాలు 14.86 శాతం, రిటైల్ లోన్లు 11.65 శాతం పెరిగాయి. క్యూ3 రిజల్ట్స్ నిలకడగా ఉన్నాయని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం ఇంకా మనపై పడలేదని, ఇన్‌ఫ్లేషన్ మరింత తగ్గుతుందని అన్నారు. ‘అన్‌సెక్యూర్డ్ లోన్లపై 30–35 శాతం గ్రోత్ ఉండకపోవచ్చు. కానీ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తాం’ అని శెట్టి అన్నారు.