
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెపో రేటుకు లింకై ఉన్న లోన్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పటికే లోన్లు పొందినవారికి, కొత్త లోన్లు తీసుకునేవారికి సవరించిన రేట్లు వర్తిస్తాయి. తాజా తగ్గింపుతో ఎస్‌బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 8.25 శాతానికి దిగొచ్చింది. అలానే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్)కు కూడా బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఇది 8.65 శాతానికి తగ్గింది. సవరించిన రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ పేర్కొంది.
మరోవైపు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. 10–-25 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. ఈ సవరణలు కూడా ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయి. 1-–-2 ఏళ్ల కాల పరిమితి గల రూ. 3 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 6.70 శాతానికి, రెండు నుంచి 3 ఏళ్లలోపు కాలపరిమితి గల ఎఫ్‌డీలపై వడ్డీ 6.90 శాతానికి తగ్గాయి. రూ. 3 కోట్లకు పైబడిన ఎఫ్‌డీల విషయంలో, 180 రోజుల నుంచి 210 రోజుల మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గి 6.40 శాతానికి, 211 రోజుల నుంచి ఏడాది లోపు గల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 6.50 శాతానికి తగ్గింది.
ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కూడా సేవింగ్స్ అకౌంట్లపై ఇచ్చే వడ్డీకి 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 2.75 శాతానికి తగ్గించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌ను ఆపేసింది. ఈ స్కీమ్ కింద 7.3 శాతం వడ్డీ అందించింది.