ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా 500 ఎస్‌బీఐ బ్రాంచ్లను తెరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎస్‌బీఐ బ్రాంచ్ నెట్‌వర్క్ 23 వేలకు చేరుతుందని తెలిపారు. ముంబైలో ఎస్‌బీఐ ప్రధాన శాఖ 100వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 1955లో ఎస్‌బీఐని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పార్లమెంటు చట్టాన్ని ఆమోదించిందని, 1921 సంవత్సరంలో 250 బ్రాంచీల నెట్‌వర్క్ ఇప్పుడు 22,500కి పెరిగిందని ఆమె చెప్పారు.
దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్‌బీఐ 22.4 శాతం వాటాను కలిగి ఉందని, దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నదని ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే, ఎస్‌బీఐ తన ఏడవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా రూ. 10వేల కోట్లను సమీకరించినట్లు సోమవారం తెలిపింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లకు 7.23 శాతం కూపన్ రేటు ఇస్తుంది. ఇందులో ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీల వంటివి ఉన్నాయి.