కస్టమర్లకు అధిక రాబడిని అందించే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పోస్టాఫీసు మధ్య గట్టి పోటీ ఉందనడంలో సందేహం లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ 3.50 శాతం నుండి 7.25 శాతం మధ్య వడ్డీ అందిస్తుండగా.. పోస్టాఫీస్ వివిధ కాలాల టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం నుండి 7.5 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తోంది.
ఈ రెండింటిలో ఏది అధిక రాబడిని ఇస్తుందో తెలుసుకొని కస్టమర్లు అందులో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఈ రెండింటిలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.. ఇక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FD), టైమ్ డిపాజిట్లు(TD) ఒకే విధంగా పనిచేస్తాయి గమనించగలరు.
ఏడాది కాల వ్యవధి: పోస్టాఫీస్ సంవత్సర కాలానికి టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీ ఇస్తోండగా.. ఎస్‌బీఐ సంవత్సర కాల వ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ అందిస్తోంది.
రెండేళ్ల కాల వ్యవధి: రెండేళ్ల కాల వ్యవధి గల డిపాజిట్లపై రెండూ ఒకే విధమైన 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.
మూడేళ్ల కాల వ్యవధి: ఇందులో ఎస్‌బీఐ.. పోస్టాఫీస్ కంటే బాగా వెనుకబడి ఉంది. మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై పోస్టాఫీస్ 7.1 శాతం రాబడిని అందిస్తుండగా.. ఎస్‌బీఐ కేవలం 6.75 శాతం వడ్డీని అందిస్తోంది.
ఐదేళ్ల కాల వ్యవధి: పోస్టాఫీస్ తమ ఖాతాదారులకు ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.5 శాతం అధిక వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లకు 5 సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.5 శాతం వడ్డీని మాత్రమే అందిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 400 రోజుల అమృత్ కలాష్ ఎఫ్‌డి స్కీమ్‌పై 7.10 శాతం వడ్డీని, 444 రోజుల అమృత్ వృష్టి ఎఫ్‌డి స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీని ఇస్తోంది.