- వార్షికంగా 0.89 శాతం పెరుగుదల..
- నిర్వహణ లాభం రూ.26,449 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం వార్షికంగా 0.89శాతం పెరిగి రూ. 17,035 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం లేదా ప్రధాన ఆదాయం సంవత్సరానికి 5.7శాతం పెరిగి రూ.41,125 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.4శాతం తగ్గి రూ.11,161.8 కోట్లకు చేరుకుంది.
నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన 4.55శాతం పెరిగి రూ.26,449 కోట్లకు చేరుకుంది. గ్రాస్ నాన్- పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో ఈ క్వార్టర్లో 3 బేసిస్ పాయింట్లు పెరిగి 2.21శాతానికి చేరింది. నికర ఎన్‌పీఏ నిష్పత్తి 0.57శాతం వద్ద స్థిరంగా ఉంది. తాజా క్వార్టర్లో కేటాయింపులు ఏడాది ప్రాతిపదికన 37.9శాతం పెరిగి రూ.3,449.4 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ఎన్‌పీఏ సంబంధిత ప్రొవిజన్లు ఏడాది ప్రాతిపదికన 70శాతం పెరిగి రూ.4,518.07 కోట్లకు చేరాయి.
జూన్ 30 నాటికి ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 74.41శాతంగా ఉంది. జూన్ క్వార్టర్లో తాజా స్లిప్పేజీలు ఏడాది ప్రాతిపదికన 3.1శాతం పెరిగి రూ.7,903 కోట్లకు చేరుకున్నాయి. అయితే, సీక్వెన్షియల్‌గా ఇవి 104శాతం పెరిగాయి.
భారీగా పెరిగిన ఖర్చులు
ఎస్బీఐ నిర్వహణ ఖర్చులు సంవత్సరానికి 0.65శాతం పెరిగి రూ.25.838 కోట్లకు చేరాయి. కేటాయింపులు, ఆకస్మిక పరిస్థితులవి మినహా మొత్తం ఖర్చులు సంవత్సరానికి 16.3శాతం పెరిగి రూ.96,239.27 కోట్లకు పెరిగాయి. దేశీయ నికర వడ్డీ మార్జిన్ సీక్వెన్షియల్‌గా 12 బేసిస్ పాయింట్లు తగ్గి 3.35శాతానికి పడిపోయింది. అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 15.39శాతం వృద్ధితో రూ.38.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
దేశీయ, కార్పొరేట్ అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 15.92శాతం పెరిగి రూ.11.38 లక్షల కోట్లకు, దేశీయ రిటైల్ వ్యక్తిగత అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 13.6శాతం పెరిగి రూ.13.68 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.18శాతం వృద్ధితో రూ.49.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాసా డిపాజిట్లు సంవత్సరానికి 2.59శాతం వృద్ధి చెంది రూ. 19.14 లక్షల కోట్లకు, దేశీయ టర్మ్ డిపాజిట్లు సంవత్సరానికి 12.2శాతం పెరిగి రూ. 27.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ క్వార్టర్లో మూలధన సమృద్ధి నిష్పత్తి 13.86శాతంగా ఉంది.