ఆదిలాబాద్ జిల్లాలో అట్రాసిటీ కేసులు ఏప్రిల్​లోగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఆదిలాబాద్ జిల్లాలో అట్రాసిటీ కేసులు ఏప్రిల్​లోగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
  • సబ్ ప్లాన్ పక్కదారి పడితే చర్యలు తప్పవు

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో అట్రాసిటీ కేసులు ఏప్రిల్ చివరిలోగా పరిష్కరించాలని, కేసుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్​జిల్లా పర్యటనలో భాగంగా గురువారం అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలిసి పలు శాఖల అధికారులతో ల్యాండ్ సర్వీస్, అట్రాసిటీ కేసులపై రివ్యూ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు.

ఆయా శాఖల్లో ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలు, ఖాళీల వివరాలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ ప్లాన్ పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ల్యాండ్, పోలీసు కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకు, ఆదిలాబాద్ ఆర్​వోర్​పై రివ్యూ నిర్వహించారు. జిల్లా సహకార అధికారి బి.మోహన్, ఏడీసీసీ బ్యాంక్ సీఈవో శ్రీధర్ రెడ్డి, ఏఎస్పీ కాజల్, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎఫ్​వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, కమిషన్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. 

కొమురం భీం కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి హామీ

పట్టణంలోని ఆదివాసీలు నివసిస్తున్న కొమురం భీం కాలనీని బక్కి వెంకటయ్య సందర్శించారు. ‘మీ కాళ్లు మొక్కుతం.. మాకు ఇండ్ల పట్టాలు ఇప్పించండి’ అని కమిషన్ చైర్మన్ ను ఆదివాసీలు కోరారు. పదేండ్లుగా ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్నామని తమ సమస్యలను వెలిబుచ్చారు. దీంతో సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి సీతక్క కాళ్లు మొక్కైనా మీ సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

గుడిహత్నూర్, వెలుగు: అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య అన్నారు. గుడిహత్నూర్‌ మండల కేంద్రానికి వచ్చిన ఆయన అంబేద్కర్, కుమ్రం భీం, అన్నాభాహుసాఠే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత బాలిక ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

ఈ కేసులో పోలీసులు  22 మందిపై కేసు నమోదు చేశారని చెప్పారు. ఆయన వెంట ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు నీలాదేవి, తహాసీల్దార్‌ కవితా రెడ్డి, ఎంపీడీవో అబ్దుల్‌, దళిత సంఘాల నాయకులు ప్రశాంత్, గంగయ్య, కరుణాకర్​, సత్యదేవ్​, దేవేందర్​ తదితరులున్నారు.