సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని వోడీఎఫ్ ఫ్యాక్టరీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని, రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేక బృందాలను నియమించాలని యాజమాన్యానికి సూచించారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు కలిసి సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సమీక్షలో వోడీఎఫ్సీజీఎం ప్రసాద్, జీఎంహెచ్ఆర్ విజయ దత్తు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు, వోడీఎఫ్ ఫ్యాక్టరీ ఉద్యోగులు పాల్గొన్నారు.