![దళితులపై కుల వివక్ష అమానుషం : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య](https://static.v6velugu.com/uploads/2025/02/sc-and-st-commission-chairman-condemns-caste-discrimination-against-dalits_5l3RtVNwIW.jpg)
సిద్దిపేట టౌన్, వెలుగు:78 ఏళ్ల స్వతంత్ర పాలనలో దళితుల పట్ల కుల వివక్ష కొనసాగడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో సామాజిక, ప్రజా సంఘాల అధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ సతీమణి రమాబాయి 127వ జయంతి వేడుకలకు ఆయన హాజరై, ఆమె ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లవుతున్నా నేటికీ దేశంలో కుల హత్యలు జరగడం క్షమించరానిదన్నారు. నగరంలో దళితులకు ఇప్పటికి ఇండ్లు అద్దెకు ఇవ్వడం లేదన్నారు. అంబేద్కర్ రమాబాయిలు కొవ్వొత్తిలా కరిగిపోయి కోట్లాది మంది జీవితాలలో వెలుగులు నింపారన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయ నేత ఆస లక్ష్మణ్, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్, కవి గాయకులు భీమ సేన, సామాజిక వేత్త శ్రీహరి యాదవ్, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, మాలమహనాడు నాయకులు పోతుల మోహన్, ఆస బాబు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ నర్సింలు, జర్నలిస్టు శంకర్, రాజయ్య, ఎల్లయ్య, రాజు, రాధాకృష్ణ , రాము పాల్గొన్నారు.