- సీఎస్, డీజీపీకి జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ఆదేశాలు
- బాధిత గ్రామాల నుంచి పోలీసులను పంపించాలని ఎస్పీకి ఆర్డర్స్
వికారాబాద్/కొడంగల్, వెలుగు: లగచర్ల ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను పది రోజుల్లో ఇవ్వాలని సీఎస్, డీజీపీలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ఆదేశించారు. అప్పటివరకు గిరిజనుల అరెస్టులను ఆపాలని, కమిషన్‌కు తెలియజేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. సోమవారం వికారాబాద్‌జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండ తండా, లగచర్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు.
దాడి వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రాత్రి వేళల్లో వచ్చి భయపెడుతున్నారని గిరిజనులు గోడు వెల్లబోసుకున్నారు. భూములు ఇవ్వనందుకే కక్ష కట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు గ్రామాల్లోనే తిష్ట వేశారని చెప్పగా.. వెంటనే పోలీసులను ఖాళీ చేయించాలని వికారాబాద్ఎస్పీ నారాయణరెడ్డిని ఎస్టీ కమిషన్మెంబర్అదేశించారు. అలాగే, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల తండాల్లో భూ సేకరణ ద్వారా ఏర్పాటు చేసే కంపెనీల గురించి ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అయిన సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలన్నారు.
కొందరు ఫార్మా, మరి కొందరు రకరకాల ఇండస్ట్రీలు వస్తాయని చెప్పడం గందరగోళానికి దారి తీస్తున్నదన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. కానీ, అమాయక గిరిజనులు నష్టపోకుండా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. భూములు కోల్పోయే వారికి మార్కెట్ రేటుతో సమానంగా పరిహారం చెల్లించాలని, లేకపోతే భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నారు.
ప్రొటెక్షన్ లేకుండా వెళ్లిన కలెక్టర్‌దే తప్పు..
లగచర్ల ఘటనను పరిశీలిస్తే ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థ ఫెయిల్అయిందని తెలుస్తోందని హుస్సేన్‌నాయక్ అన్నారు. ఘటనకు ముందు రోటిబండ తండాలో లాఠీచార్జ్ జరిగిందని.. అయినా కలెక్టర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం తప్పని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ స్వలాభం కోసం గిరిజన బిడ్డల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి హుస్సేన్ నాయక్ తో ఉన్నారు.