
- రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం చైర్మన్, సభ్యులు రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4,313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,614 మంది రైతులకు 2,860 ఎకరాలను పంపిణీ చేశామన్నారు.
పెండింగ్‌లో ఉన్న పోడు పట్టాల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందించాలన్నారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు కమిషన్ సభ్యులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడేండ్లుగా ఎస్సీ, ఎస్టీలపై వేధించిన ఘటనలపై 233 ఫిర్యాదులు రాగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, 136 చార్జి షిట్ దాఖలు చేశారన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాధాభాయి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాజన్న సేవలో కమిషన్ చైర్మన్, సభ్యులు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబూ నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ లకు దర్శించుకున్నారు. కల్యాణ మండపంలో ఈవో కె.వినోద్‌రెడ్డి వారికి శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి కి అధికారులు కృషి చేయాలని చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా పూర్తిగా ఎస్సీ, ఎస్టీలకే కేటాయించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం అమలుకు కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గదేపల్లి పరిధిలో ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లత, ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజకుమార్, అధికారులు పాల్గొన్నారు.