తెలంగాణ బడ్జెట్: సంక్షేమానికి భారీగా.. ఎస్సీ వెల్ఫేర్కు రూ. 40,232 కోట్లు

తెలంగాణ బడ్జెట్: సంక్షేమానికి భారీగా.. ఎస్సీ వెల్ఫేర్కు రూ. 40,232 కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు
  • మహిళా స్త్రీ శిశు సంక్షేమానికి రూ.2,862 కోట్లు కేటాయింపు
  • మైనార్టీలకు రూ.3,591 కోట్లు

హైదరాబాద్, వెలుగు: సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్​లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, మహిళా స్ర్తీ శిశు సంక్షేమం కోసం మొత్తం కలిపి రూ.75,259 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ వెల్ఫేర్‌‌‌‌కి రూ.40,232 కోట్లు (13.19 శాతం) అలాట్‌‌ చేసింది. పలు కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఫండ్స్ కేటాయించారు. ట్రైబల్ వెల్ఫేర్​కు రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు, మహిళా స్త్రీ శిశు సంక్షేమానికి రూ.2,862 కోట్లు, మైనార్టీలకు రూ.3,591 కోట్లు అలాట్‌‌ చేశారు.

ఎస్సీ, ఎస్టీ కేటాయింపుల్లో సబ్‌‌ ప్లాన్ నిధులను కూడా కలిపి చూపించారు. వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సబ్‌‌ప్లాన్ నిధులను ఖర్చు చేయనున్నారు. గీత కార్మికుల టాడి కార్పొరేషన్​కు రూ.68 కోట్లు, బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్​కు రూ.80 కోట్లు, కల్యాణ లక్ష్మికి రూ.3,683 కోట్లు, షాదీ ముబారక్​కు రూ.2,173 కోట్లు, బీసీ గురుకులాలకు రూ.500 కోట్లు, ఎస్సీ గురుకులాలకు రూ.4,394.68 కోట్లు కేటాయించారు.

ఆత్మ గౌరవ కుల భవనాలకు రూ.100 కోట్లు, 19 కుల సంఘాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు రూ.950 కోట్లు, ఎస్టీ ట్రైబల్ స్కూల్స్ నిర్మాణానికి రూ.442.89 కోట్లు అలకేట్ చేశారు. ట్రైకార్​కు రూ.1,360 కోట్లు కేటాయించగా.. ఇందులో రాజీవ్ యువ వికాసం, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్స్ స్కీమ్, ఇందిర జల వికాసం, స్కిల్ డెవలప్​మెంట్​కు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. మోస్ట్ బ్యాక్​వర్డ్ కార్పొరేషన్​కు రూ.400 కోట్లు, నేత కార్మికులకు రూ.450 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్​లో సంక్షేమానికి రూ.23,810 కోట్లు కేటాయించగా ఈసారి భారీగా నిధులు పెంచారు.

గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ చట్టం అమలును నిర్లక్ష్యం చేసిందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2023–24లో సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన రూ.13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన రూ.1,317 కోట్లను ఖర్చు చేయకుండా బకాయి పెట్టిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన చట్టాలను గౌరవించి, వారికి చెందాల్సిన నిధులను కేటాయించడం.. ఈ వర్గాల పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.