ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు నిరంతరం పోరాటం

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు నిరంతరం పోరాటం
  • మాదిగల ఐక్య సంక్షేమ సంఘం వెల్లడి 

ముషీరాబాద్, వెలుగు: విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ప్రతి కార్పొరేట్ స్కూల్, కాలేజీల్లో 25 శాతం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్య అందించాలని మాదిగల ఐక్య సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మిద్దెపాక రవీందర్ అధ్యక్షతన జరిగింది. 

రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ అప్పికట్ల భరత్ భూషణ్, నాయకులు పల్లెల వీరస్వామి, జిలకర శ్రీనివాస్, పి ముత్తయ్య, ప్రొఫెసర్ నతనియల్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. దేశ వ్యాప్తంగా మాదిగలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వివక్షకు గురవుతున్నారని చెప్పారు. 

మాదిగ జాతి ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఐక్యతతో ముందుకు నడవాలని సూచించారు. భవిష్యత్​తరాల కోసమైనా పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఒకే వేదిక మీదికి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు నిరంతరం పోరాటం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో విజయ్ పాల్, మురళీధర్, వశపాక నరసింహ, జన్ను నరసయ్య తదితరులు పాల్గొన్నారు.