ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం : కాల్వ నరేశ్​

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం : కాల్వ నరేశ్​
  • మాల మహానాడు సోషల్​ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాల్వ నరేశ్​

దుబ్బాక, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు సోషల్​మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాల్వ నరేశ్​ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం దుబ్బాక అంబేద్కర్​ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించడం మాలలకు చీకటి రోజు అన్నారు.

జస్టిస్ షమీమ్​అక్తర్​ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని, 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని చేయడం మాలలను మోసగించడమేనని ఆరోపించారు. కమిషన్​సూచించిన రోస్టర్​ పాయింట్లలోనూ మాలలకు విద్యా, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

మాల, మాదిగలను రాజకీయ లబ్ధి పొందడానికే కాంగ్రెస్​ ప్రభుత్వం విడదీసిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మాలల సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. సంఘం నేతలు కాల్వ లింగం, ఆస స్వామి, ఆస చిన్న ముత్యం, తునికి సురేశ్​, మండల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.