ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చర్చ.. జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటన

ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చర్చ.. జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటన

అమరావతి: ఎస్సీ వర్గీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పాం.. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.  జనాభా లెక్కలు పూర్తయ్యాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గకరీణపై సీఎం చంద్రబాబు గురువారం (మార్చి 20) అసెంబ్లీలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం 1996లోనే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశామని.. అలాగే రేషనలైజేషన్, కేటగిరీలపై 2000 సంవత్సరంలోనే చట్టం చేశామని గుర్తు చేశారు. 

2000 సంవత్సరంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ కూడా రిపోర్టు్ ఇచ్చిందన్నారు. ఇప్పటికి కొంతమంది సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డారని.. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా అసమానతలపై పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం నేను చేసిన ఆలోచన సబబేనని.. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఇదే చెప్పిందని పేర్కొన్నారు. 

ALSO READ | 23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి

అలాగే.. సామాజిక న్యాయం కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించింది ఎన్టీఆరేనని అన్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లను ప్రారంభించింది కూడా ఎన్టీరేనన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో అంటరానితనం పరాకాష్టకు చేరింది. మనిషిని మనిషిగా అంగీకరించే పరిస్థితి ఉండేది కాదు. దీనికి వ్యతిరేకంగా కుల వివక్షపై యుద్ధం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. 

అంటరానితనం నిర్మూలన కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశామని.. సమాజంలో అంటరానితనం ఉండటానికి వీల్లేదని నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. అంటరానితనం రూపుమాపాటానికి 27 జీవోలు ఇచ్చాం. ఎస్సీలను చిన్నచూపుతో చూస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టామని తెలిపారు. మాదిగ దండోరా పేరుతో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు.