ఎస్సీ వర్గీకరణపై జీవో విడుదల.. అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం

ఎస్సీ వర్గీకరణపై జీవో విడుదల.. అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయ శాఖ విడుదల చేసింది. దీంతో.. తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 8న ఎస్సీ వర్గీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించారు. మూడు గ్రూపులుగా 56 ఎస్సీ కులాల విభజన జరిగింది. గ్రూప్-ఏలో ఉన్నవారికి ఒక శాతం రిజర్వేషన్ వర్తింపు, గ్రూప్-బీలో ఉన్నవారికి 9 శాతం రిజర్వేషన్లు, గ్రూప్-సీలో ఉన్నవారికి 5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. 59 ఎస్సీ కులాలు, ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వానికి వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని 15 షెడ్యూల్డ్‌‌ కులాలను కమిషన్‌‌ గ్రూప్‌‌–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్‌‌ అమలు చేయాలని సిఫారసు చేసింది. ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన 18 షెడ్యూల్డ్‌‌ కులాలను గ్రూప్‌‌–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్‌‌ కల్పించాలని సిఫారసు చేసింది. మెరుగైన ప్రయోజనం పొందిన 26 షెడ్యూల్డ్‌‌ కులాలను గ్రూప్‌‌–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963% ఉన్న వీరికి 5% రిజర్వేషన్‌‌ ఇవ్వాలని సిఫారసు చేసింది.

సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను దేశంలోనే అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. నిరుడు ఆగస్టు 1న  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే రోజు వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి​ ప్రకటించారు. 2024 అక్టోబర్ లో  వర్గీకరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్  షమీమ్ అక్తర్ చైర్మన్ గా ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ ను నియమించింది.  ఎస్సీ ఉప కులాల అంతటా సామాజిక -ఆర్థిక సూచికలను అధ్యయనం చేసే పనిని కమిషన్​ చేపట్టింది. అన్ని జిల్లాల్లో పర్యటించి వర్గీకరణపై సలహాలు, సూచనలు స్వీకరించింది.

వర్గీకరణపై కమిషన్ కు 8,600 కంటే ఎక్కువ ప్రతిపాదనలు అందగా,  జనాభా, అక్షరాస్యత , ఉద్యోగాలు,  ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం , రాజకీయ భాగస్వామ్యం, తదితర అంశాలపై కమిషన్ అధ్యయనం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రభుత్వానికి తుది రిపోర్ట్ను కమిషన్​ అందజేసింది. అనంతరం వివిధ  సంఘాలు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించడానికి కమిషన్ టర్మ్ ను ఒక నెలపాటు ప్రభుత్వం పొడిగించింది.