మందకృష్ణ వ్యాఖ్యలు అర్థరహితం : సతీశ్ మాదిగ

మందకృష్ణ వ్యాఖ్యలు అర్థరహితం : సతీశ్ మాదిగ
  • కొత్త ఉద్యోగ నియామకాల్లోనే ఎస్సీ వర్గీకరణ అమలు: సతీశ్ మాదిగ

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశం చట్టంగా  రూపొందిన తర్వాతే  ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లలో అమలవుతుందని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు సతీశ్ మాదిగ అన్నారు. ప్రస్తుతం రిలీజ్ అయ్యే గ్రూప్ 1, 2 నియామకాల్లో వర్తించదని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ వేగం అయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యే వరకు నియామకాలు ఆపాలన్న మంద కృష్ణ వ్యాఖ్యలు అర్థరహితమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. 

వర్గీకరణ చట్టం అయ్యాక ఆర్డినెన్స్ ఇచ్చి ఉద్యోగాల భర్తీలో న్యాయం చేస్తామని సీఎం ప్రకటించారన్నారు. 30 ఏండ్ల నుంచి జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం గురించి సీఎం రేవంత్​కు పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రస్తుత నియామకాల్లో అమలు చేయాలంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని తాము సీఎంను కలిసిన సమయంలో చెప్పారని సతీశ్ మాదిగ గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మాదిగలకు సీఎం రేవంత్ అన్యాయం చేస్తున్నారని, ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు.