- సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం
- జడ్జిలు రేణుక యారా, నర్సింగ్‌రావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు పేర్లు కేంద్రానికి సిఫారసు
- సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు త్వరలోనే కొత్త జడ్జిలు రానున్నారు. 2025 జనవరి 11న జరిగిన భేటీలో నలుగురు జిల్లా కోర్టు జడ్జిలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జిల్లా జడ్జిల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇ.తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) బి.ఆర్.మధుసూదన్‌రావు పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈ నలుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు.
కాగా, హైదరాబాద్‌కు చెందిన జడ్జి రేణుక యారా బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజీ ఆఫ్ లాలో 1998లో ఎల్‌ఎల్‌బీ, ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1998లో రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయి సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన జడ్జి నందికొండ నర్సింగ్ రావు పీఎంఆర్ లా కాలేజీలో 1995లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. అదే ఏడాది రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2012లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికై.. విశాఖపట్నం అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సంగారెడ్డికి చెందిన ఇ.తిరుమలా దేవి 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌కు చెందిన బి.ఆర్. మధుసూదన్‌రావు 1998-–1999లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. 2012 డిసెంబర్లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా విధులు నిర్వర్తిస్తున్నారు.