జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు: బార్ కౌన్సిల్ వ్యతిరేకించినా.. అలహాబాద్ హైకోర్టుకే జస్టిస్ వర్మ..

జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు: బార్ కౌన్సిల్ వ్యతిరేకించినా.. అలహాబాద్ హైకోర్టుకే జస్టిస్ వర్మ..

ఇంట్లో నోట్ల కట్టల కేసుతో సంచలనం సృష్టించిన జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో సుప్రీం కోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా సూచించింది. ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న క్రమంలో.. అలహాబాద్ కే జస్టిస్ వర్మను బదిలీ చేయాలనే నిర్ణయం చర్చీయాంశం అయ్యింది. 

సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయంపై అలహాబాద్ బార్ కౌన్సిల్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ‘‘అలహాబాద్ హైకోర్టు చెత్త బుట్ట కాదు’’ అని వ్యాఖ్యానించిన బార్ కౌన్సిల్.. కొలీజియం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ అంశంపై బార్ కౌన్సిల్ ప్రసిడెంట్ అనిల్ తివారి సోమవారం (మార్చి 24) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము 11 ప్రపోజల్స్ పంపామని, ముందుగా తాము జస్టిస్ వర్మ బదిలీని ఒప్పుకోమని, బదిలీ ఇప్పుడు జరిగినా, భవిష్యత్తులో జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. 

ఈ కేసులో జస్టిస్ వర్మపై విచారణకు అనుమతిచాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్తించారు. సీబీఐ, ఈడీ తదితర విచారణ సంస్థలను అనుమతించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మాన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కేసు ఆలస్యం అయ్యేకొద్ది ఆధారాలను నాశనం చేసే అవకాశం ఉంది. కొలీజియం జడ్జిలను నియమించే విధానంపై కూడా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. సత్సంబంధాలు ఉన్న వ్యక్తులకు అవకాశం కల్పించేలా ప్రస్తుత కొలీజియం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. 

ALSO READ | Chhaava: పార్లమెంటులో 'ఛావా' స్పెషల్ షో.. సినిమాకు పీఎం మోదీ, కేంద్ర మంత్రులు

మార్చి 14న జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయిన ఘటనలో జస్టిస్ వర్మపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.  జస్టిస్ వర్మ అధికారక నివాసం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా ఓ గదిలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. కాస్త ఆలస్యంగానే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు కొలీజియం దీనిపై అత్యవసర విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఇంతకు ముందే ప్రకటించింది. దీనిపై అలహాబాద్ బార్ కౌన్సిల్ ముందునుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది.

ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సుప్రీం కోర్టు విడుదల చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటోలు, వీడియోలు మొదలైన ఆధారాలను పబ్లిక్ గా అందుబాటులో ఉండేలా చీఫ్ జస్టిస్ట్ విడుదల చేశారు. ఢిల్లీ హైకోర్టు అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ వివరాలను అందరికీ అందుబాటులో ఉంచారు.