న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ట్రాన్స్ఫర్ కోసం సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, పలువురు సీనియర్ జడ్జిలతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేస్తు కొలీజియం సిఫార్సు చేసింది.
అలాగే జస్టిస్ కె.వినోద్ చంద్రన్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు అంశాలను కొలిజియం కేంద్రానికి రెకమెండ్ చేసింది అయితే.. ఈ సిఫారసులను కేంద్రం పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత సిఫార్సులు అమల్లోకి వస్తాయి.