అధికారులపై ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు ఫైర్
అట్రాసిటీ కేసుల్లో పరిహారమూ ఇవ్వరా?
జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపైనా ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం ఇవ్వడంలో ఇంత నిర్లక్ష్యమా? అన్ని జిల్లాల్లో హైదరాబాద్ వెనకుంటదా? ఎస్సీ కమిషన్ రివ్యూ మీటింగ్ పెడితే 17 మంది ఏసీపీల్లో ఒక్కరు కూడా రారా? సమావేశాన్ని పోలీసు డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా తీసుకోదా? రెవెన్యూ వాళ్లు కూడా మీటింగ్‌కు రారా?’ అంటూ నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ కె. రాములు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ వాళ్లే ఎస్సీలను పట్టించుకోకపోతే పేదలు, ముఖ్యంగా ఎస్సీలు ఎట్లా బతుకుతారని ప్రశ్నించారు. ఇకమీదట అధికారులు పూర్తి సమాచారంతో రావాలని, లేకపోతే తమకున్న అధికారాలు వాడాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీసు, రెవెన్యూ డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో 65 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎంత మంది స్టేషన్ ఆఫీసర్లు, ఎస్సైలు, సీఐలు ఎస్సీలని అడగ్గా సమాచారం లేదని అధికారులు చెప్పడంతో రాములు సీరియస్ అయ్యారు. జిల్లా పరిధిలో ఎన్ని రేప్ కేసులు నమోదయ్యయని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‍ను అడగ్గా ఈ ఏడాది 20 రేప్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మైనర్ రేప్ కేసుల వివరాలడిగితే చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ డిపార్టుమెంట్ కూడా నిర్లక్యంగా వ్యవహరిస్తోందని, ఎస్సీల సమస్యలపై ఇకనైనా కలెక్టర్ మాణిక్‌రాజ్ దృష్టి పెట్టాలని సూచించారు.
18 శాతం మాత్రమే పరిష్కారం
2019లో హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 65 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనట్లు అంజనీకుమార్ తెలిపారు. 2018లో 150 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాదిలో నమోదైన 65 కేసుల్లో 19 కేసుల్లో జడ్జిమెంట్ వచ్చిందని పోలీసులు తెలిపారు. 18 శాతం కేసులే పరిష్కారమవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని తెలుపుతోందని రాములు అన్నారు. ‘ప్రజల సమస్యలపై మాట్లాడితే అధికారులకు కోపం వస్తుంది’ అని చురకలంటించారు. ఎస్సీ/ఎస్టీ కేసులు దుర్వినియోగం చేసేందుకు కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసిందని, వాటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సూచించారు.
మరి వైఎస్ విగ్రహమెట్లుంది?
గ్రేటర్ పరిధిలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని రాములు ఆదేశించారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వివాదానికి కారణమైన అధికారులపై తీసుకున్న చర్యలేంటని అడిగారు. అంబేద్కర్ విగ్రహం తొలగించిన అధికారులు.. అనుమతి లేకుండా రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఎలా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏళ్ల తరబడి ముసుగు వేసి ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ బోర్డులో రిటైర్డ్ అయిన వారి కొనసాగింపు సరికాదని చెప్పారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను ప్రతి కార్యాలయంలో నిర్వహించాలని, అధికారుల చాంబర్లలో వాళ్ల ఫోటోలు ప్రదర్శించాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు
ప్రమోషన్‌లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా పోస్టింగులు ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని రాములు ప్రశ్నించారు. ఉద్యోగులు పని చేయకుండా ఎంజాయ్ చేస్తున్నారంటూ అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ ముందే దురుసుగా మాట్లాడుతున్న అడిషనల్ కమిషనర్ ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవచ్చన్నారు.