వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం

వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం
  • 2011 జనాభా లెక్కలతో నష్టం జరిగింది
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

బషీర్​బాగ్, వెలుగు: తప్పుల తడకగా ఉన్న షమీమ్ అక్తర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేసి, రాజ్యాంగం అందించిన సమాన, విస్తృత అవకాశాలను దూరం చేయడం కరెక్ట్​కాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. సైఫాబాద్ మింట్ కాంపౌండ్ లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని10 జిల్లాల్లో ఎస్సీ జనాభా 54,32,680 ఉంటే.. షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికలో మూడు గ్రూపులకు కలిపి జనాభాను 52,17,580గా చూపించారన్నారు. మాలలను 2,15,100 తగ్గించి అన్యాయం చేశారని మండిపడ్డారు. 

ఉమ్మడి రాష్ట్రంలోని లెక్కలతో మాలలకు నష్టం జరిగిందన్నారు. 2007లో ఉషామెహ్రా కమిషన్ తెలంగాణ ప్రాంతంలో మాలల కంటే మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పిందన్నారు. మాలలను అభివృద్ధి చెందిన గ్రూపులో చేర్చి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

 మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జంగా శ్రీనివాస్, బంగి ఆనంద్ రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం.సరళ, నాయకులు ఎం.శ్రీకాంత్, రామాంజనేయులు, అనిల్ కుమార్, ఎల్ల స్వామి, బాలకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.