నస్పూర్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ముసుగులో ఎస్సీ కార్పొరేషన్ ను మాయం చేసిందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ మండిపడ్డారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. అందరికి సహాయం అందించే ఎస్సీ కార్పొరేషన్‌ను బంద్ చేసి, వారి కార్యకర్తల కోసం మాత్రమే దళిత బంధు ప్రారంభించారని విమర్శించారు. మొదటి ఎన్నికల్లో దళితుడిని సీఎం చేస్తానని, రెండో ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి అని, ప్రస్తుతం దళిత బంధు అని చెప్పి మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. నేరెళ్ల, హాజీపూర్, చెన్నూర్‌లో దళితులపై దాడులు జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలన్నారు. మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ గెలుపు కోసం మాదిగ హక్కుల దండోరా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కడారి రమేశ్, నస్పూర్ టౌన్ అధ్యక్షుడు అట్కపూరం సమయ్య, జిల్లా కార్యదర్శి సత్తన్న, నాయకులు మిట్టపల్లి మొగిళి, ఎంవైఎస్ జిల్లా అధ్యక్షుడు సీపెల్లి సందీప్, ఎంఎస్ఎఫ్ లీడర్లు కోండ్ర ఉదయ్, సంజీవ్, వేల్పుల అజేయ్ తదితరులు పాల్గొన్నారు.