ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్​

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్​
  • పలు కండిషన్లతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • ట్రయల్​కు పూర్తిగా సహకరించాలని ఆదేశం
  • సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్​ రద్దు చేస్తామన్న కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఉన్న మేకల తిరుపతన్న (అప్పటి అడిషనల్ ఎస్పీ) కు సుప్రీంకోర్టు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

ట్రయల్​కు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిరుడు అక్టోబర్ 20న తిరుపతన్న సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. సుదీర్ఘకాలంగా జైలులో ఉంటున్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కోరారు. 

ఈ పిటిషన్  సోమవారం జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ  ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, మోహిత్ రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా హాజరయ్యారు. 

తొలుత సిద్దార్థ దవే వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ గత 10 నెలల నాలుగు రోజులుగా జైలులో ఉన్నారని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్​ దాఖలు చేశారని తెలిపారు. అందువల్ల ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. ఇంకెంత కాలం విచారణ చేపడతారో  చెప్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం విచారణకు మరెంత టైం పడుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

నిందితులు దేశం విడిచి పారిపోయారు.. 

ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులు దేశం విడిచి పారిపోయారని బెంచ్ కు ప్రభుత్వం తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. వీరితోపాటు తిరుపతన్న ప్రధాన నిందితుడిగా ఉన్నారని వాదించారు. 

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌తోపాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని వివరించారు. రిటైర్​మెంట్ తర్వాత ఐజీగా పని చేసిన ప్రభాకర్ రావు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన దేశం విడిచి పారిపోయారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఆ ఐజీ స్థాయి అధికారి డైరెక్షన్​లో 18 మందితో వాట్సాప్ లో ప్రత్యేకంగా గ్రూప్ పెట్టుకొని, ఫోన్ ట్యాపింగ్​పై తిరుపతన్న ఆదేశాలు ఇచ్చారన్నారు. మొత్తం ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వ్యవహారంలో  కీలక పాత్ర పోషించిన తిరుపతన్న ఆధారాలు చెరిపివేయడంలో కూడా అంతే కీలకంగా ఉన్నారని తెలిపారు. 

ప్రధానంగా థర్డ్ పార్టీ ఆదేశాల మేరకు(అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నేతలు) అందరి ఫోన్లను ట్యాప్‌‌ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, 2023 డిసెంబర్‌‌ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేశారని ధర్మాసనానికి లూథ్రా వివరించారు. 

ఇందులో భాగంగా హార్డ్ డిస్క్​లను ధ్వంసం చేయడంతోపాటు  కంప్యూటర్ల పాస్ వర్డ్ లను  మార్చారని నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో తిరుపతన్న పాత్ర దర్యాప్తునకు మరో 4  నెలల సమయం పడుతుందని లూథ్రా తెలిపారు. 

ఇద్దరు దేశం విడిచిపోయినా.. వాట్సాప్ గ్రూప్ లోని ఇతర అధికారుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నట్టు వివరించారు. అలాగే ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని, ప్రస్తుతం గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు. 

కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని, ఈటైంలో తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తే మొత్తం దర్యాప్తుపైనే ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సాక్షులు, ఆధారాలను ప్రభావితం చేసే ఆస్కారం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని, తిరుపతన్న పాస్‌‌పోర్టు వెంటనే సరెండర్​ చేసేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

షరతులతో మంజూరు 

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.  ఇప్పటికే 10 నెలలుగా నిందితుడు జైలులో ఉంటున్నాడని, ఇంతకాలం ఆయనను జైలులో ఉంచలేమని వ్యాఖ్యానించింది.

 అయితే, తిరుపతన్న ట్రయల్​కి పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయవద్దని తీర్పులో ప్రస్తావించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చేరిపేయడానికి ప్రయత్నించినా.. రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించ వచ్చని స్పష్టం చేసింది. పాస్ పోర్టు సరెండర్ చేయడం సహా ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నది.