
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్న, అర్హత సాధించిన తర్వాత సీటు పొందాలన్న క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ తప్పనిసరని గురుకుల సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి చెప్పారు. ఈ నెల 23న గురుకులాల్లో అడ్మిషన్లకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 51,968 సీట్లకు 1,67,708 అప్లికేషన్లు వచ్చాయని.. అంటే గతేడాదితో పోలిస్తే సుమారు 15వేలు అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లోని సీట్లను పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచే గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని, అధికారులతో మాట్లాడుతూ ఈ అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.
అడ్మిషన్ల కోసం అప్లై చేసుకునే స్టూడెంట్స్ కు త్వరగా క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్లకు చెబుతున్నామని ఆమె అన్నారు. గురుకులాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని మధ్యవర్తులు చెబుతున్న మాటలు నమ్మొద్దని, సీటు కోసం ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని అలుగు వర్షిణి సూచించారు. గురుకులాల్లోని ఒక్కో స్టూడెంట్ పై ప్రభుత్వం రూ.80 వేల నుంచి రూ.1 లక్ష ఖర్చు పెడుతున్నదని సెక్రటరీ వెల్లడించారు. ఎంట్రన్స్ టెస్లుకు అప్లై చేసుకునే సమయంలోనే ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ ఇచ్చి, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు.