హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఎస్సీ గురుకుల సొసైటీ తీవ్రంగా ఖండించింది. ఎస్సీ గురుకులాల్లో పిల్లలపై పర్యవేక్షణ బాగాలేదని ఆయన కామెంట్లు బాధ్యతారాహిత్యమని, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై, గురుకులాలపై, సీఎంపై కామెంట్స్ చేయటం విచారకరమన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్.. సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలాంటి ఘటనలు జరగలేదా అని ఆమె ప్రశ్నించారు. “ ఆర్ఎస్ ప్రవీణ్ మా పిల్లలు అని అనడం అభ్యంతరకరమైనది. కొందరు విద్యార్థులు మాత్రమే మా పిల్లలు అయితే, మిగతావారు కాదా? వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తెలంగాణలో భాగం కాదా? ఇటువంటి భాష ఆర్ఎస్పీకి మన రాష్ట్రంలోని చిన్న పిల్లల పట్ల ఉన్న సంకుచిత ఆలోచనను ప్రతిబింబిస్తుంది.
ఆయన దృష్టి నిజంగా విద్య , సంస్కరణలపై ఉంటే, గత ఆరు నెలల్లో గురుకులాలను బాగు చేయాలనే అంశంపై ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం సీఎంను విమర్శించటం కరెక్ట్ కాదు ” అని సెక్రటరీ స్పష్టం చేశారు. గతేడాది నుంచి గురుకులాలపై ప్రభుత్వం శ్రద్ధ పెడుతోందని, ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా కాస్మోటిక్, డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని సెక్రటరీ అలుగు వర్షిణి గుర్తు చేశారు. బేస్ లెస్ ఆరోపణలు చేయెద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సెక్రటరీ సూచించారు.