పార్లమెంట్‎ను అడగండి: పిల్లలు సోషల్‌ మీడియా వినియోగంపై బ్యాన్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

పార్లమెంట్‎ను అడగండి: పిల్లలు సోషల్‌ మీడియా వినియోగంపై బ్యాన్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్‎ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఇది విధానపరమైన అంశమని.. మా చేతుల్లో ఏం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిల్లల సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించాలని పార్లమెంట్‎ను కోరాలని పిటిషనర్‎కు సూచించింది. 

కాగా, 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని కోరుతూ జెప్ ఫౌండేషన్ దాఖలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల యాక్సెస్‌ను నియంత్రించడానికి బయోమెట్రిక్ ప్రామాణీకరణ వయస్సు ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని.. అలాగే పిల్లల రక్షణ నిబంధనలను పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన చర్యలు తీసుకునేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. 

ఇప్పటికే చాలా దేశాలు పిల్లల సోషల్ మీడియా వినియోగించకుండా బ్యాన్ విధించాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్‎ను శుక్రవారం (ఏప్రిల్ 4) జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేదం విధించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. 

Also Read:-టార్గెట్ మస్క్.. ఎక్స్‌పై యూరోపియన్ యూనియన్ పెనాల్టీ ప్లాన్..!

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది విధానపరమైన విషయం. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించాలని మీరు పార్లమెంటును చట్టం చేయమని అడగండి. ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించలేము. దీనికి పరిష్కారం విధానపరమైన నిర్ణయం పరిధిలో ఉంది. సంబంధిత విభాగానికి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ఫిర్యాదు వస్తే 8 వారాల్లోగా అధికారులు దానిని పరిష్కరించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.