- కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆర్డర్
- దీనిపై కొత్త కేసులు తీసుకోవద్దని.. తీర్పులు కూడా ఇవ్వొద్దని ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసుల విచారణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసుల విచారణను నాలుగు వారాల పాటు ఆపేయాలని దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్ తో కూడిన స్పెషల్ బెంచ్ గురువారం విచారించింది.
ఈ చట్టం పౌరుల మతపరమైన స్వేచ్ఛ, న్యాయాన్ని పొందే హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ కీలక వాఖ్యలు చేసింది. మత పరమైన వివాదాలు సున్నితమైనవని పేర్కొంది. 1991 ప్రార్థనా స్థలాల చట్టంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్నందున.. దేశంలోని ఆలయాలు, మసీదులతో సహా ప్రార్థనా స్థలాలపై కొనసాగుతున్న సర్వేలను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అలాగే, దేశంలోని వివిధ కోర్టుల్లో ప్రార్థనా స్థలాల వివాదాలకు సంబంధించిన పిటిషన్లపై జరుగుతున్న విచారణలను కూడా ఆపేయాలని దిగువ కోర్టులను సుప్రీం ఆదేశించింది. దీంతో పాటుగా విచారణ పూర్తి అయిన పిటిషన్లపై తుది తీర్పును వెలువరించవద్దని సూచించింది. కొత్త కేసులను కూడా స్వీకరించరాదని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రకటించింది.
ప్రార్థనా స్థలాల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లో స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలిపేవరకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు ఈ మేరకు తేల్చి చెప్పింది.
వేధింపులే ఆత్మహత్యకు ప్రేరేపించాయంటే సరిపోదు..
ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ నమోదైన కేసుల్లో నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి కేవలం వేధింపుల ఆరోపణలు మాత్రమే సరిపోవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 306 కింద ఒకరిని దోషిగా నిర్ధారించాలంటే ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలని వెల్లడించింది. గుజరాత్ లో ఓ మహిళకు 2009లో వివాహమైంది. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ 2021లో సూసైడ్ చేసుకుంది.
తన కూతురు సూసైడ్ చేసుకోవడానికి ఆమె భర్త, అత్తమామలే కారణం అని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ఐపీసీలోని 498ఏ, 306 సెక్షన్ల కింద కేసు వేశారు. ఈ కేసులో నిందితులకు గుజరాత్ హైకోర్టులో ఊరట లభించలేదు. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.."సెక్షన్ 306 ప్రకారం నేరారోపణకు స్పష్టమైన ఆధారం చూపించాలి. లేకుంటే ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దోషిగా నిర్ధారించలేం.
ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వేధింపులకు పాల్పడినట్లు రుజువు చేయాలి. వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే సమర్పించిన సాక్ష్యాలను అంచనా వేయాలి. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేనంతగా నిందితులు ప్రేరేపించినట్లు ఎవిడెన్స్ కావాలి" అని కోర్టు పేర్కొంది. నిందితులను విడుదల చేసింది. 498ఏ ప్రకారం ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని పోలీసులకు తెలిపింది.