- ఫార్ములా–ఈ రేసు కేసులో మరో షాక్
- క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేసిన కేటీఆర్
- ఈ స్టేజ్‌లో తాము కలుగజేస్కోలేమన్న సుప్రీంకోర్టు
- అవినీతి జరగలేదన్న వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం
- పిటిషన్ విత్ డ్రా చేస్కునే స్వేచ్ఛ కూడా లేదంటూ సీరియస్
- పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విత్ డ్రాకు చాన్స్ ఇస్తూనే డిస్మిస్
న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా ఈ–రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ షాక్ తగిలింది. ఏసీబీ విచారణ నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టేయగా.. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ (పీసీ)–13(1)(ఏ) కిందికి ఈ కేసు రాదని కేటీఆర్ లాయర్ పలుమార్లు వాదించినా.. సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ స్టేజ్‌లో హైకోర్టు తీర్పులో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది.
పిటిషన్‌ను డిస్మిస్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది అని భావించిన కేటీఆర్.. తమ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకునేందుకు అనుమతివ్వాలని అడ్వకేట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విత్ డ్రా చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని వాదించారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. కేసు ఫైల్ చేసి, ఈ స్టేజ్‌లో విత్ డ్రా అంటే ఎట్లా అని ప్రశ్నించింది. ఇలాంటి టైమ్‌లో విత్ డ్రా స్వేచ్ఛ మీకు లేదని తేల్చిచెప్పింది. పలుమార్లు పిటిషనర్ విజ్ఞప్తి చేయడంతో.. చివరికి విత్ డ్రా అవకాశం ఇస్తూనే మరోవైపు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. డిస్మిస్డ్ యాజ్ విత్‌డ్రా అని తీర్పు వెలువరించింది.
కుట్రతోనే కేసు: కేటీఆర్ తరఫు అడ్వకేట్
ఫార్ములా–ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఆ మధ్య కేటీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ నెల 7న హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. దీంతో అదే రోజు కేటీఆర్ తరపు అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో మొత్తం 430 పేజీలతో కూడిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో రిలీఫ్ దక్కలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ఈ పిటిషన్ ను దాఖలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన పిటిషన్ పరిగణనలోకి తీసుకొని ప్రొసీడింగ్స్ ను రద్దుచేయాలని హైకోర్టులో కోరితే అందుకు న్యాయస్థానం అంగీకరించలేదని తెలిపారు. హైకోర్టు తీర్పును రద్దు చేసేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ ప్రసన్న వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కేటీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం, సిద్దార్థ దవే, ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు.
తొలుత కేటీఆర్ తరఫున అడ్వకేట్ అర్యం సుందరం వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం మారగానే కుట్ర, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేటీఆర్ పై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఫార్ములా –ఈ రేస్చట్టబద్ధంగా నిర్వహించారని తెలిపారు. ఫార్ములా –ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి రూ. 700 కోట్ల మేలు జరిగిందని బెంచ్ దృష్టికి తెచ్చారు. కేటీఆర్ తో ఒక్క రూపాయి లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ (పీసీ)–13(1)(ఏ) కింద అక్రమ కేసు పెట్టారని.. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఎక్కడా ఆధారం లేదని పేర్కొన్నారు.
‘‘ఈ డబ్బు ట్రాన్స్ ఫర్ లో కేటీఆర్ ఏ విధంగానూ లబ్ధి పొందలేదు. ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్లు ఎవరూ చెప్పడం లేదు. 9వ సీజన్ ఫార్ములా–ఈ రేస్‌లో ప్రభుత్వానికి మేలు జరిగినందున.. స్పాన్సర్లు విత్ డ్రా అయినప్పటికీ సీజన్ 10 కోసం ముందుకెళ్లారు. ఫార్ములా –ఈ రేస్‌లో పొరపాట్లు, అక్రమాలను హెచ్ఎండీఏ గుర్తించింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ. 54 కోట్ల చెల్లింపులు చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారని కంప్లైంట్ చేసింది. ఆ నిబంధలను కేటీఆర్ ఎలా బాధ్యుడు? డబ్బులు చెల్లించిన హెచ్ఎండీఏ, అందుకున్న రేసింగ్ సంస్థ లను నిందితులుగా చేర్చలేదు’’ అని కేటీఆర్ తరపు అడ్వకేట్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
మీకు విత్ డ్రా చేస్కుంటామనే స్వేచ్ఛ లేదు: సుప్రీం
ఫారెన్ కరెన్సీ చెల్లింపుల రూల్స్ పాటించనట్టు, ఆర్బీఐ అనుమతి పొందలేదనట్టు వస్తున్న ఆరోపణలు కాసేపు నిజమే అనుకున్నా.. ఇవన్నీ పీసీ యాక్ట్ 13(1)(ఏ) కిందికి రావని.. అలాంటప్పుడు ఏసీబీ ఎలా దర్యాప్తు చేస్తుందని కేటీఆర్ తరఫు అడ్వకేట్ సుందరం వాదించారు. దీనిపై జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకొని.. ‘‘చెరువులో ఉన్న చేప నీళ్లు తాగుతుందా? లేదా? అన్నట్లు ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ న్యాయవాది రోహిత్గి మాట్లాడుతూ.. ‘‘ఫార్ములా–ఈ రేసులు పెట్టారు. చట్టాలను ఉల్లంఘించారు. ఇష్టం ఉన్నవారికి చెల్లింపులు చేశారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. చట్టాలు, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. లాభాలు వచ్చాయని చెప్తూనే.. మళ్లీ హెచ్ఎండీఏ సంస్థతో స్పాన్సర్ చేయించారని తెలిపారు. స్పాన్సర్ లేరనే సాకుతో రేసుల పేరుతో ఎలా కోట్లు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇందులో అవినీతి ఉందా? లేదా? అన్నది తేలాలంటే దర్యాప్తు జరగాలన్నారు. ఈ స్టేజ్‌లో దర్యాప్తును అడ్డుకోవద్దని ధర్మాసనాన్ని రోహిత్గి కోరారు.
తమకున్న స్వేచ్ఛ ప్రకారం ఈ స్టేజ్‌లో తమ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫున అడ్వకేట్ సుందరం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసులో హైకోర్టు తమకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. అయితే ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వ తరఫు అడ్వకేట్ ముకుల్ రోహిత్గి తీవ్ర అభ్యంతరం తెలిపారు. చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. కాగా, పిటిషనర్ విజ్ఞప్తిపై జస్టిస్ బేలా ఎం త్రివేది స్పందిస్తూ.. ‘‘ఫైలింగ్‌లో లోటుపాట్లు.. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో, డాక్యుమెంట్ సబ్మిషన్ లో తప్పిదాలు ఉంటే అనుమతిస్తం. అంతేకానీ కేసు మొత్తాన్ని ఫైల్ చేసి, ఈ స్టేజ్‌లో విత్ డ్రా చేయాలంటే చేయలేం. ఆ స్వేచ్ఛ మీకు లేదు’’ అని స్పష్టం చేశారు. చివరికి పిటిషర్ తరఫు అడ్వకేట్ పలుమార్లు కోరగా.. పిటిషన్‌ను కొట్టివేస్తూనే, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
తప్పు చేయలేదని ఎట్లచెప్తరు?: ప్రభుత్వ తరఫు అడ్వకేట్
డిసెంబర్ 18న కేసు ఫైల్ అయితే.. ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలంటూ 24 గంటల్లోనే కోర్టును కేటీఆర్ ఆశ్రయించి వెంటనే ప్రొటెక్షన్ తెచ్చుకున్నారని ప్రభుత్వ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దర్యాప్తు చేసేందుకు టైం ఇవ్వకుం డానే తప్పు చేయలేదని ఎట్ల చెప్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ తరఫు అడ్వకేట్సుందరం వాదిస్తూ... హెచ్ఎండీఏ సాయంత్రం 5.30కు కంప్లైంట్ చేస్తే, మరుసటి రోజు ఉదయమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నా రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ను అరెస్ట్ చేయాలని, ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు.
గతంలో చరణ్ సింగ్ పై దాఖలైన కేసులో పీసీ యాక్ట్ ప్రకారం ఆచీతూచి వ్యవహరించి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు రోహిత్గి బదులిస్తూ.. ఈ కేసు వ్యవహారంలో గవర్నర్ అనుమతి తీసుకున్నామని తెలిపారు. గవర్నర్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారని కోర్టుకు ఆయన నివేదించారు. జస్టిస్ బేలా ఎం త్రివేది స్పందిస్తూ.. కేటీఆర్‌పై దాఖలైన ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసేందుకు చరణ్ సింగ్ కేసును ఉదాహరణగా తీసుకోలేమని స్పష్టం చేశారు.