ఎస్సీల రిజర్వేషన్లూ పెంచాల్సిందే! : బైరి వెంకటేశం

ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ జీఓ విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం. దళితులకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉన్నది. దళితుల్లో మాల, మాదిగల కంటే ఎంతోకాలంగా అత్యంత వెనుకబడి, అణచివేతకు, వివక్షకు గురవుతున్న ఎస్సీ ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 22 లక్షల జనాభా ఉన్న ఎస్సీల్లో 57 ఉపకులాలు ఉన్నాయి.  రాష్ట్రంలో ప్రస్తుతం గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి10 శాతానికి పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 66 శాతానికి చేరుకుంటాయి. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం రిజర్వేషన్ కోటాను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది.

ఈ సందర్భంలో మన రాష్ట్రం అందుకు మినహాయింపు కాదని ప్రజలు, మేధావులు భావిస్తున్నారు. రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు ఇతర వర్గాలతో సంబంధం లేకుండా వారి జనాభా నిషపత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లే.. ఎస్సీ, ఎస్టీలకు పెరిగిన జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడం కోసం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధంగా దళితులకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి.

అన్ని రకాలుగా అన్యాయం..

ఉమ్మడి రాష్ట్రంలో 2000 నుంచి 2004 సంవత్సరం వరకు అమలైన ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగ కులాలతో పోలిస్తే మిగిలిన 57 ఉపకులాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురైన విషయాన్ని అనేక నివేదికలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా 63,60,158 ఉంటే ఇందులో మాదిగ కులస్తుల జనాభా 25,09,992 అంటే మొత్తం ఎస్సీ జనాభాలో వీరు 39 శాతం ఉన్నారు. మాల కులస్తుల జనాభా 17,05,448 లక్షలు అనగా ఎస్సీ జనాభాలో 27 శాతం ఉన్నారు. ఈ రెండు కులాలు కాకుండా ఎస్సీల్లో రెక్కల కష్టంపై మాత్రమే ఆధారపడి జీవించే  మిగతా కులాలైన మోచి, బైండ్ల, హోలీయదాసరి, గోసంగి, చిందు, మాస్టిన్, మాదిగ జంగం, మాల జంగం, డక్కలి, సమగర, బేడ బుడగజంగం, నేతకాని, మితల్ అయ్యళ్వార్లు, మాదాసి కురువ, పాకి, బ్యాగరి, దోంబరా, మన్నే మొదలైన వారు చాలా వరకు వెనకబడి ఉన్నారు.

57 ఉపకులాల జనాభా 21,44,718. ఎస్సీల జనాభాలో వీరిది 34 శాతం.  దేశ చరిత్రను, పురాణాలను భాగవతం, యక్షగానాల రూపంలో భవిష్యత్ తరాలకు అందిస్తున్న ఉపకులాలకు చెందిన ప్రజలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ భిక్షాటన చేస్తూ, అంగళ్లలో పూసలు అమ్ముకుంటూ, రోడ్డుపై చెప్పులు కుట్టుకుంటూ, సంచార జీవనం గడుపుతున్నారు. వీధినాటకాలు, యక్షగానాలు వేస్తూ,  సర్కస్ చేస్తూ, గ్రామ దేవతలకు పూజారులుగాఉంటూ, కేవలం రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ నాటికి కూడా ప్రభుత్వపరంగా దళితులకు అందే అభివృద్ధి ఫలాలు వీరు పొందలేకపోతున్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగా మాల, మాదిగ కులాల కంటే వీరు అత్యంత వెనుకబడిఉన్నారు.

రాజకీయంగా స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు ఎస్సీ ఉపకులాలకు కనీస ప్రాతినిధ్యం లేదు.  2014 నుంచి 20-21 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొందిన శాతాన్ని గమనిస్తే ఎవరికి ఎంత మేలు జరుగుతున్న విషయం తేలిపోతుంది. 39 శాతం జనాభా ఉన్న మాదిగలు 69.1 శాతం యూనిట్లు పొందగా, 27 శాతం జనాభా కలిగిన మాల కులస్తులు 23.5 శాతం పొందారు. కానీ 34 శాతం జనాభా కలిగిన ఎస్సీ ఉపకులాలు కేవలం 7.4 శాతం రుణాలను మాత్రమే పొందారు. గిరిజనులతో పాటు ఇతర ఏవర్గాలతో పోల్చినా అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాల కోసమైనా ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని పెంచి ఆదుకోవాలి. 

ఎస్సీల జనాభా పెరిగింది

ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీల జనాభా ప్రాతిపదికన 15 శాతం రిజర్వేషన్లు అమలు చేశాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీల జనాభా16 శాతానికి పైగా పెరిగింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా దాదాపు18.5 శాతం ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన ఎస్సీల రిజర్వేషన్లు ప్రస్తుత జనాభా ప్రాతిపదికన కనీసం మూడున్నర శాతం పెంచాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు పెరిగితే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచడం సరే.. మరి ఎస్సీల జనాభా పెరుగుదల ప్రకారం వారి రిజర్వేషన్లు ఎప్పుడు పెంచుతారు?

- బైరి వెంకటేశం, రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి