
- తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- పెండింగ్‌లో ఉన్న ఆ పది బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు
- ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు 3 నెలల్లో క్లియర్ చేయాలి
- బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైమ్‌లైన్ ప్రకటించిన బెంచ్
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్‌లో పెట్టిన ఆ పది బిల్లులు పాస్ అయినట్లే భావించాలని ఆదేశించింది. శాసన సభ పాస్ చేసి పంపిన బిల్లులకు ఆమోదం లేదా తిరస్కరించే విషయంలో గవర్నర్‌కు నిర్ణీత గడువంటూ లేదు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన వద్దకు వచ్చిన బిల్లులపై 3 నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని గడువు ఏర్పాటు చేస్తూ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ల బెంచ్చరిత్రాత్మక తీర్పు చెప్పింది. బిల్లులకు ఆమోదాన్ని విత్ హోల్డ్ చేయడం, రాష్ట్రపతి పరిశీలనకు లేదా మంత్రుల కౌన్సిల్ పరిశీలనకు పంపించాలని భావిస్తే నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వానికి తిప్పిపంపాలని భావించే సందర్భంలో 3 నెలల గడువులోపే పంపించాలని స్పష్టం చేసింది. తిప్పి పంపిన బిల్లులను ప్రభుత్వం పరిశీలించి మళ్లీ ఆమోదం కోసం పంపిస్తే వాటికి నెలలోపు ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది.
ఆ పది బిల్లులు పాస్ అయినట్లే..
‘‘రాష్ట్రపతి ఆమోదం కోసం 10 బిల్లులను అట్టిపెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధం. రెండోసారి ఆ బిల్లులు గవర్నర్‌కు అందిన రోజే అవి ఆమోదం పొందినట్లు భావించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ నిర్వహించే విధులపై ప్రత్యేకంగా టైమ్ లిమిట్ లేకపోయినా.. గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండడం కరెక్టు కాదు” అని బెంచ్ కామెంట్ చేసింది. గడువులోగా నిర్ణయం తీసుకోకుంటే గవర్నర్ చర్య మీద సమీక్షించాల్సి వస్తుందని హెచ్చరించింది. జ్యుడీషియల్ రివ్యూ నుంచి గవర్నర్ కు మినహాయింపులేదని తెలిపింది. తమిళనాడు గవర్నర్ కు అందిన బిల్లులు పాస్ అయినట్లే భావిస్తున్నామని, ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్లీనరీ పవర్ ను వాడుతున్నామని బెంచ్ తెలిపింది. ‘‘చట్టసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని ఉన్నందున, అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను క్లియర్ చేసే విషయంలో గవర్నర్ అవరోధంగా మారకూడదు. ఈ విషయంలో గవర్నర్ జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లులపై గవర్నర్ స్పందించాలి” అని బెంచ్ వ్యాఖ్యానించింది. రాష్ట్రానికి గవర్నర్ ఒక ఫ్రెండ్‌గా, ఫిలాసఫర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించింది. కాగా.. తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులకు ఆమోదం తెలపడంలో ఎందుకు జాప్యం చేశారని అంతకుముందు గవర్నర్‌కు బెంచ్ 12 ప్రశ్నలు వేసింది. అలాగే, మళ్లీ పాస్ చేసిన
బిల్లులను రాష్ట్రపతికి ఎలా రెఫర్ చేస్తారని నిలదీసింది.
తీర్పు చరిత్రాత్మకం: స్టాలిన్
సుప్రీంకోర్టు తీర్పును తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల విజయమని పేర్కొన్నారు. తమిళనాడు చేసిన న్యాయపోరాటం దేశమంతా చూసిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ‘‘బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉండలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులు క్లియర్ చేసేందుకు గవర్నర్ కు సుప్రీంకోర్టు నెల నుంచి మూడు నెలల గడువు ఇచ్చింది. సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి విజయం సాధించారు” అని ఉదయనిధి పేర్కొన్నారు.