ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలను రాజకీయ అధికారానికి దూరం చేసే ఉద్దేశంతోనే బీజేపీ వర్గీకరణకు పూనుకుందని విమర్శించింది. 

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్​పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టింది.

 మాల సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు పై బైఠాయించేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోరాట సమితి కన్వీనర్ చెన్నయ్య, కో కన్వీనర్ చెరుకు రామచందర్ మాట్లాడారు. 

ఎస్సీ, ఎస్టీ కులాలను వర్గీకరణకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 పరిగణనలోకి తీసుకోకుండానే సుప్రీం కోర్టు వర్గీకరణపై తీర్పునిచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు, మెజారిటీ దళితులు, గిరిజనులు, ఎంపీలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.