ప్రముఖ సినీ రచయత కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కార్లపాలెంలో కేసు నమోదయ్యింది. వైసీపీకి రాజీనామా చేసిన దళిత నేత కత్తి రాజేష్ శనివారం తన అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో రాజేష్ తమ వద్ద రూ.8లక్షలు అప్పు తీసుకున్నాడని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఎస్సై ఛాంబర్లో వైసీపీ నాయకులతో కలిసి కోన వెంకట్, ఎస్సై తనపై దాడి చేశారని రాజేష్ ఆరోపించారు.
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని అక్కసుతో తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నరేంద్ర వర్మ, అన్నం సతీష్, గోవర్ధన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలతో కలిసి గణపవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవటంతో కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజేష్ ఫిర్యాదుతో కోన వెంకట్ తో పాటు వైసీపీ నేతలు, ఎస్సై జనార్దన్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు పోలీసులు.